జోరువానలో ఆగ్రహ జ్వాల | protest on anganwadi workers, ikp | Sakshi
Sakshi News home page

జోరువానలో ఆగ్రహ జ్వాల

Published Sat, Sep 20 2014 4:33 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

జోరువానలో ఆగ్రహ జ్వాల - Sakshi

జోరువానలో ఆగ్రహ జ్వాల

- టీడీపీ నేతల తీరుకు నిరసనగా  పెద్ద ఎత్తున ఆందోళన
- వాళ్ల మనుషులను పెట్టుకోవడానికి మమ్మల్ని తొలగిస్తున్నారు
- తెలుగుదేశానికి ఓటేయలేదనే వేధిస్తున్నారు
- అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ,ఐకేపీ వర్కర్ల నిరసన
- కలెక్టరేట్ దిగ్బంధం
- వర్షంలోనూ కొనసాగిన ధర్నా, రాస్తారోకో
- మహిళలు, పోలీసుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది.  మహిళలమని  చూడకుండా టీడీపీ నేతలు తమను నానా దుర్భాషలాడుతూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని అంగన్‌వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని పెట్టుకునేందుకు కారణాల్లేకుండా, తమ పట్ల నీచంగా ప్రవరిస్తూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కదం తొక్కారు. రెండు గేట్లనూ మూసేసి మహా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ను దిగ్బంధిం చి ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలను అడ్డుకున్నారు.

జోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాస్తారోకో చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్‌వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, ఆశ వర్కర్లు కలెక్టరేట్‌కు చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధారాణి, తమ్మినేని సూర్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సుధారాణి తదితరులు మాట్లాడుతూ   టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మహిళా ఉద్యోగులపై కారణాల్లేకుండా వేటు వేస్తున్నారన్నారు.

ఓటు వేయలేదనే అక్కసుతోనే ఇదం తా చేస్తున్నారని ఆరోపించారు. తమవారిని నియమిం చుకునేందుకు కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 30 మంది మధ్యాహ్న భోజన వర్కర్లను జిల్లా వ్యాప్తంగా తొల గించారన్నారు. ఆశ వర్కర్లకు ప్రభుత్వం పెంచిన రూ.300  మొత్తాన్ని వేతనాలకు కలపకుండా వదిలేశారన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా నిర్వహించినపుడు అందరినీ వినియోగించుకోవడమే తప్ప ఎటువంటి ప్రయోజనాలనూ కల్పించడం లేదన్నారు. ఐకేపీలో 15 నెలలుగా వీబీకేలకు (విలేజ్ బుక్ కీపర్లు) వేతనాలు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ వారికి వ్వాల్సిన వేతనాలు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళల పట్ల నీచంగా ప్రవర్తిసూ,  విధుల నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన మధ్యాహ్న భోజన వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.
 
ఓ వైపు వర్షం.. మరో వైపు ఆందోళన
ఓ వైపు జోరుగా వర్షం పడుతున్నా మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. తడుస్తూనే ధర్నా కొనసాగించారు. మరోవైపు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
 
మహిళల జుత్తు పట్టుకుని, మెడపై చేతులేసి....
ఆందోళనకారులంతా  కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించారు. వర్షం పడుతుండడంతో తమ డిమాండ్లు నెరవేర్చేందుకు గడువు విధించి విరమించాలని, వినతిపత్రాన్ని కలెక్టర్, జేసీ తదితరులకు ఇవ్వాలని మహిళలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో   ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పోలీసులు మహిళల జుత్తు పట్టుకుని లాగేశారు. మరికొంతమంది మెడపై చేతులేసి నెట్టేశారు. ఈ సమయంలో మహిళలు పెద్దపెట్టున కేకలు వేశారు. బిగ్గరగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షలు ఆపాలంటూ నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలా కలెక్టరేట్ దిగ్బంధం మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ బి.రామారావు, డీఆర్వో బి.హేమసుందర్‌లకు ఆందోళనకారులు వినతిపత్రం అందించారు. తొలగించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులను 15 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని, ఆశ, వీబీకేలకు వేతనాలు ఇవ్వాలనీ ఈ సందర్భంగా గడువు విధించారు. లేకుంటే 16వ రోజున తిరిగి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు తమ్మినేని సూర్యనారాయణతో పాటు  ఉమామహేశ్వరి, సుధారాణి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఆర్ జయప్రద, అంగన్‌వాడీ, ఐకేపీ, ఆశ, మధ్యాహ్న భోజన నిర్వహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement