నెల్లూరు(రెవెన్యూ): ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ-పాస్ విధానం అమలులో జాప్యం కారణంగా కార్డుదారులు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ప్రజాపంపిణీ ప్రక్రియ 6వ తేదీదాటిన ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ ఇప్పటి వరకు చౌకదుకాణాలకు చేరలేదు. ఈ-పాస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న చౌకదుకాణాల డీలర్లు రేషన్ దుకాణాల్లోకి అన్‌లోడ్ చేసుకోవడంలేదు.ఈ-పాస్ విధానానికి వ్యతిరేకిస్తు డీలర్లు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో 1,874 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల రేషన్‌కార్డుదారులు ఉన్నారు.
ప్రతి నెల జిల్లాలో 18 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు రేషన్ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో మొదటివిడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ముం దస్తుగా పట్టణ ప్రాంతాల్లోని 350 చౌకదుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు చేసి రేషన్ పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకు 120 ఈ-పాస్ మిషన్లు రావడంతో అధికారులు ఇబ్బందుల్లోపడ్డారు. జిల్లాలో ఉన్న చౌకదుకాణాల్లో పూర్తిస్థాయిలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈవిషయంపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించారు. అధికారులు సిఫార్సులను పట్టించుకోకపోవడంతో డీలర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ-పాస్ మిషన్లలో డేటా అప్‌లోడ్ చేయడం, సిమ్‌కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30కి పైగా ఈ-పాస్ మిషన్లలో అప్‌డేట్ చేయలేదు.
ఈ-పాస్ విధానం అమలులో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే తాము రేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటామని డీలర్లు ఎదురుతిరిగారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్న బియ్యం తూకంలో తేడాలు వస్తున్నయని దాంతో డీలర్లు నష్టపోవాల్సి వస్తుందని ఈ సమస్యకు పరిష్కారం చూపేంతవరకు రేషన్ దింపుకునేదిలేదని డీలర్లు భీష్మించుకుకూర్చున్నారు. అధికారులు, డీలర్ల మధ్య కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చౌకదుకాణానికి రావడం షాపు తీయకపోవడంతో వెనుతిరుగుతున్నారు.
చర్యలు తీసుకుంటాం :
-సంధ్యారాణి, డీఎస్‌ఓ
ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసిన చౌకదుకాణాల్లో రేషన్ పంపిణీ జరి గేలా చర్యలు తీసుకుంటాం. డేటా అప్‌డేట్ చేయడం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 120 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశాం. వచ్చేనెలలో మిగిలిన చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
ప్రజాపంపిణీ అయోమయం
Published Sat, Mar 7 2015 2:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement