ప్రాణసంకటం
Published Sun, Jan 19 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటం.. అన్నట్లు తయారైంది పేద రోగుల పరిస్థితి. ఏదైనా అనారోగ్యం వస్తే ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక సర్కారు దవాఖానాకు వచ్చే పేద రోగులకు నాసిరకం మందులు అంటగడుతూ వారి ప్రాణాలతో వైద్యసిబ్బంది ఆటలాడుకుంటున్నారు. ఎలాంటి మందులిస్తే ఏంటి? పోయేది పేదోడి ప్రాణమే కదా! అన్న తరహాలో ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యో నారాయణో హరి అని భావించే రోగులు వారు ఇచ్చే మందులను అలాగే వాడుతున్నారు.
విజయనగరం మండలం కోరుకొండ పాలెం గ్రామానికి చెందిన పి. అప్పారావు కడుపులో మంట వస్తోందని కేంద్రాస్పత్రికి వెళ్లాడు. అక్కడ రెంటిడిన్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు వేసుకోవడానికి తీసి చూస్తే ముద్దలా అయిపోయాయి. దీంతో వాటిని వాడడం మానేసి బయట మందుల దుకాణంలో కొనుక్కున్నాడు. ఇదే మండలం, ఇదే గ్రామానికి చెందిన పి.సురేష్‌ది కూడా అదే పరిస్థితి. ఇతనికి కూడా కడుపులో బాగులేకపోవడంతో కేంద్రాస్పత్రికి వెళ్లాడు. వైద్యులు రెంటిడిన్ మాత్రలు ఇచ్చారు. ఇంటికి వెళ్లి స్ట్రిప్ప్ తెరవగా మాత్రలు పిండి లాగా అయిపోయాయి. దీంతో వాటిని బయట పారవేసి బయట మందుల దుకాణంలో కొనుగోలు చేసి వాడుతున్నాడు. ఈ ఇద్దరి విషయంలో నాసిరకం మాత్రలు బయటపడ్డాయి. జిల్లాలో అధికశాతం మంది రక్తపోటుకు ఎంటినాల్, మధుమేహ వ్యాధికి మెట్‌పార్మిన్, కడుపులో నొప్పికి సంబంధించి ఇచ్చే మెట్రోజోల్ మాత్రలు, జ్వరానికి ఉపయోగించే పారాసిట్‌మాల్ మాత్రలు కూడా నాసిరకంగానే ఉన్నట్టు పలువురు రోగులు ఆరోపిస్తున్నారు.
విజయనగరంఆరోగ్యం,న్యూస్‌లైన్: ప్రజారోగ్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం నాసిరకం మందులను సరఫరా చేస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. సర్కారు సరఫరా చేసే మందులు అలాగే వేసుకుంటే రోగం తగ్గకపోగా మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే రెంటిడిన్ మాత్రలు నాసిరకంగా ఉన్నాయి. కొన్ని స్ట్రిప్పుల్లో మాత్రలు ఖాళీగా ఉండగా, మరి కొన్ని స్ట్రిప్పుల్లో మాత్రలు బెల్లం ఊటల్లా తయారయ్యాయి. ఆ మాత్రలు వేసుకుంటే వ్యాధి తగ్గడం మాట దేవుడెరుగు వ్యాధి మరింత తీవ్రమవడం ఖాయమని రోగులు వాపోతున్నారు. జిల్లాలో 7 వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు, 8 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 68 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటికి ఏపీఎంఐడీసీ(ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సొసైటీ) ద్వారా మందులు సరఫరా చేస్తారు.ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మందుల కంపెనీలు ఏపీఎంఐడీసీకి మందులను సరఫరా చేస్తాయి. అయితే ఆ మందుల నాణ్యతను పరిశీలించి సరఫరా చేయాల్సిన అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం మందులను సరఫరా చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే లక్షల్లో నాసిరకం మాత్రల పంపిణీ
క్వార్టర్‌కు (మూడునెలలకు) రెంటిడిన్ మాత్రలు 6లక్షల వరకు వినియోగమవుతున్నాయి. కేంద్రాస్పత్రిలోనే రోజుకు 500 వరకు రెంటిడిన్ మాత్రలు వినియోగమవు తాయి. మాత్రలు నాసిరకం అని తెలియక అమాయక రోగులు వేసుకుంటున్నారు. ఇవి పనిచేయవని తెలిసినా గత్యంతరం లేక వాడుతున్నారు. మరి కొంతమంది మాత్రలు బయటపడేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇంతవరకు పీహెచ్‌సీ, వైద్యవిధాన్ పరిషత్ ఆస్పత్రులు, సీహెచ్‌సీలకు 24 లక్షల మాత్రలు సరఫరా అయ్యాయి.
పాంటెప్ స్ట్రిప్పుల్లో మాత్రలు ఖాళీ
జీర్ణకోశ వ్యాధులకు ఇచ్చే పాంటెప్ మాత్రలు కూడా పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. ఒక స్ట్రిప్‌లో పది మాత్రలు ఉండాల్సి ఉండగా 9 మాత్రమే ఉంటున్నాయి. దీంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పేదోడికి ఇచ్చే మందు బిళ్లలపై ప్రభుత్వం చిన్నచూపు చూడ డంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏపీఎంఐడీసీ ఈఈ టీవీఎస్‌ఎన్.రెడ్డి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా మందుల కంపెనీలు సరఫరా చేసిన మందులను నేరుగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాం. మాత్రలు నాణ్యత లేదని సంబంధిత ఆస్పత్రుల వైద్యాధికారులు తిరిగి పంపిస్తే కంపెనీలకు పంపిస్తామన్నారు.
Advertisement