సాక్షి, కాకినాడ : ప్రజాధనమంటే కంచె, కాపలా లేని పండ్లతోటలా భావించే కొందరు అధికారులు, అధికార పార్టీ నేతలు కాకినాడ నగరపాలక సంస్థలో నామినేషన్ పనుల పేరుతో తమ పంట పండించుకున్నారు. కేవలం అయిదు నెలల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.2.90 కోట్ల విలువైన 297కి పైగా పనులను ఆ విధానంలో కేటాయించారు. వాటిలో కొన్ని పనులను అసలు చేయకుండానే చేసినట్టు చూపి, రూ.10 ఖర్చు చేయాల్సిన కొన్నిపనులకు ఒక్క రూపాయే ఖర్చుపెట్టి.. తద్వారా మిగిలిన సొమ్మును వాటాలుగా పంచేసుకున్నారు.
నిబంధనల ప్రకారం రూ.లక్ష దాటిచేసే ప్రతి పనికీ టెండర్ పిలవాలి. అత్యవసరమనుకుంటే కమిషనర్ విచక్షణపై రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో కేటాయించవచ్చు. నామినేషన్ పనులను మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణకు మాత్రమే పరిమితం చేయాలి. కానీ నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలను సముద్రంలో కలిపేసి ‘అత్యవసరం’ ముసుగులో కోట్ల రూపాయల పనులను అధికార పార్టీ వారికి కట్టబెట్టేశారు.
కాకినాడ మునిసిపాలిటీగా ఉన్నప్పుడు, నగరపాలక సంస్థ హోదా వచ్చాక ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల పనులు నామినేషన్ పద్ధతిలో మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఇన్ని పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడంపై కార్పొరేషన్ వర్గాలే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ వ్యవహారాన్ని పురపాలకశాఖామంత్రి మహీధరరెడ్డి, కలెక్టర్ నీతూ ప్రసాద్, డీఎంఏ, విజిలెన్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ బాగోతం వెలుగుచూసింది.
డిప్యూటేషన్‌పై వచ్చిన కమిషనర్ రవికుమార్‌కు పురపాలనపై అవగాహన లేకపోవడంతో కోట్ల విలువైన పనులను ఇలా నామినేషన్ పద్ధతిలో మంజూరు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి ద్వారంపూడి రాజీనామా చేయడంతో అధికార పక్ష నేతలను ప్రసన్నం చేసుకునేందుకో, వారి ఒత్తిడులకు తలొగ్గో కార్పొరేషన్ అధికారులు పనుల పందేరం చేశారంటున్నారు.
‘అత్యవసరం’ కేటగిరీలో రూ.50 లక్షల పనులే..
సాంబమూర్తినగర్, రెవెన్యూ కాలనీ, సూర్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో అత్యవసరం పరిధిలోకి రాని రోడ్లు, డ్రైన్‌ల వంటి కాంట్రాక్టర్‌లకు కలిసొచ్చే పనులను నామినేషన్ పద్ధతిలో చక్కబెట్టేశారు. మొత్తం మంజూరు చేసిన పనుల్లో కేవలం రూ.50 లక్షలు విలువైన పనులు మాత్రమే అత్యవసర పరిధిలోకి వచ్చే మంచినీటికి, వీధి దీపాలకు ఖర్చు చేశారు. మిగిలిన రూ.2.40 కోట్లు పనులు ఇంజనీరింగ్, ఇతర విభాగాలకు సంబంధించినవే.
వీటికి అంచనాలు వేసి టెండర్లు పిలిస్తే తక్కువ మొత్తాలకే పనులు చేసేలా కొటేషన్లు పడి నగరపాలక సంస్థకు ఎంతో సొమ్ము ఆదా అయ్యేది. వీటన్నింటినీ నామినేషన్ పద్ధతిలో చేయించడంలో లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా నామినేషన్ పనుల వ్యవహారంపై విచారణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజుకు అప్పగించినట్టు కార్పొరేషన్ వర్గాల ద్వారా తెలిసింది.
నిబంధనల మేరకే నామినేషన్ పనులు
నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన నామినేషన్ పనులన్నీ నిబంధనల మేరకే చేశాం. రూ.లక్ష లోపు చిన్నచిన్న పనులు కావడంతో మాకున్న అధికారాన్ని బట్టి అనుమతినిచ్చాం. అవికూడా చట్టపరిధిలోనే జరిగాయి.
- వి.రవికుమార్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్
‘అత్యవసరం’ ముసుగులో మేసేశారు..!
Published Wed, Jan 8 2014 6:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement