ప్రజా ఉద్యమంపై పీడీ యాక్టా? | public movement PD ycat | Sakshi
Sakshi News home page

ప్రజా ఉద్యమంపై పీడీ యాక్టా?

Published Sun, Jan 12 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

public movement PD ycat

 బలభద్రపురం (బిక్కవోలు), న్యూస్‌లైన్ :కాలుష్య కర్మాగారాల వల్ల ప్రజలకు హాని జరుగుతుందని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ధ్వజ మెత్తారు. కేపీఆర్ సంస్థ నిర్మిస్తున్న కా లుష్య కారక, థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పో రాటం చేస్తున్న పడాల వెంకటరామారెడ్డిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దొంతమూరు నుంచి పాదయాత్ర చేపట్టి బలభద్రపురం వంతెన వద్ద సుమారు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ స్మగ్లర్లు, సంఘ విద్రోహ శక్తులు, దారుణమైన నేర చరిత్ర కలిగిన వారిపై ప్రయోగించే పీడీ యాక్ట్‌ను కలెక్టర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో రాము చేపట్టిన ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్న రాము హింసాత్మక సంఘటనలకు పాల్పడినట్టు కలెక్టర్ నిరూపించగలరా అని సవాల్ విసిరారు. అయితే కలెక్టర్ ఇచ్చిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను ఆగమేఘాలపై సీఎం కూడా ఆమోదించినట్టు తమకు తెలిసిందని, దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
 పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ప్రజలు 11 నెలలుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాసి ఉద్యమ నేతలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఉద్యమ నేత కాకర్ల సూరిబాబు మాట్లాడుతూ కలెక్టర్ ప్రారిశ్రామిక వేత్తలకు అండగా ఉండడాన్ని దుయ్యబట్టారు. కలెక్టర్ అయి ఉండి ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం దృష్టిలో ఉంచుతున్నామని, మొదటిది పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసిన రామును విడుదల చేయాలన్నారు. ఉద్యమకారులపై ఇప్పటివరకు ఉన్న కేసులను ఎత్తివేయాలని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే కేపీఆర్ సంస్థలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. కేపీఆర్ సంస్థలు నిర్మిస్తున్న పరిశ్రమలకు పరిసర గ్రామాలైన ఆర్‌ఎస్ పేట, నల్లమిల్లి పంచాయతీలతో సంస్థ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించాలన్నారు. 
 
 అధికార దుర్వినియోగానికి పాల్పడిన అనపర్తి సీఐ కోనాల నాగమోహనరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ న్యాయబద్ధమైన ఈ డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాడతామని, ఉద్యమకారులకు అందుబాటులో ఉంటామని చెప్పారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నేత బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమానిదే అంతిమ విజయం అవుతుందన్నారు. పార్టీ అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో విజయం సాధించే వరకూ పోరాడుతామన్నారు. ఆందోళన సమయంలో అనపర్తి వైపు నుంచి వస్తున్న 108కు, అత్యవసర వైద్యం కోసం రాయవరం వైపు వెళ్లే ఆటోకు ఆందోళనకారులు దారిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పి.కె.రావు, విప్పర్తి వేణుగోపాలరావు, కర్రి శేషారత్నం, సబెళ్ల కృష్ణారెడ్డి, వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
 
 కంటతడి పెట్టిన సునీత
 తన భర్త రాము ప్రజల కోసం పోరాటం చేస్తూ, జైలు పాలు కాగా, అదే సమయంలో తన కుమార్తె పుష్పవతి కావడంతో జైలుకు వెల్లి తండ్రితో అక్షింతలు వేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని సునీత కంటతడి పెట్టారు. ఇప్పుడు సంక్రాంతి పండగ సమయంలోనూ అక్రమంగా జైలుపాలు చేసి వేధిస్తున్నారని ఉద్వేగానికి లోనయ్యారు. ఆందోళన చెందవద్దని, పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్సార్ సీపీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement