ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నివారించేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయులను అవస్థల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఒక ప్రాంతంలో సెటిలైన వారిని ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉన్నఫళంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు నూతన బాధ్యతల్లో చేరగా.. మిగిలిన వారు చేరేందుకు ససేమిరా అంటున్నారు.
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా నివారించాలని ప్రభుత్వం, విద్యాశాఖ తలచింది. ఈ నేపథ్యంలో పని సర్దుబాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నేటి వరకు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మరికొన్ని రోజుల వ్యవధి పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఈవో పూల్‌లో 20 మంది మిగులు ఉపాధ్యాయులున్నా వారిని ఇతర స్థానాలకు సర్దుబాటు చేయకుండా అలానే ఉంచారు.
డీఈవోపై ఒత్తిడి...
జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 73 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రం అతికష్టం మీద సర్దుబాటు చేసినట్లు సమాచారం. మిగిలిన 33 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్దుబాటుకు సుముఖంగా లేని ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమకు అనుకూలమైన రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో డీఈఓ సైతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో తప్పకుండా చేరాలని, చేరని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సమస్యల భయంతో వెనకడుగు...
ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకించేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఓ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అయ్యవార్లకు ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి అనంతరమే బదిలీలు ఉంటాయి. అలా కాదని తమకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కోరితే అందుకు అనుమతించరు. అలాంటి తరుణంలో ప్రభుత్వం, విద్యాశాఖకు ఇష్టమైనప్పుడు మాత్రం ఇలాంటి పద్ధతికి తెర తీయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ తాత్కాలికమే అని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. వివిధ పాఠశాలలకు సర్దుబాటు అయ్యే ఉపాధ్యాయులు 2018–19 విద్యా సంవత్సరం ముగిసేవరకు మాత్రమే ఆయా పాఠశాలల్లో కొనసాగుతారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తిరిగి గత పాఠశాలలకు వచ్చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. ఒక వేళ ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించినా.. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలకు ఎంపిక చేయాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి తప్పనిసరి. తర్వాత కొద్ది కాలానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్దుబాటుకు వెళ్లిన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా కొనసాగాల్సి అవసరం ఉంది. రవాణా ఖర్చులు సైతం తడిసి మోపెడు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి కేటాయించిన పాఠశాలకు వెళ్లాలంటే చార్జీల రూపంలో అదనపు ఖర్చులు తప్పవు. ఈ కారణాల దృష్ట్యా సర్దుబాటుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
ప్రమోషన్లు వస్తే పూర్వ స్కూల్‌కే...
ఒక వేళ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు మధ్యలోనే వారు పనిచేసిన పూర్వ పాఠశాలలకు వచ్చేయాల్సి ఉంటుంది. లేదా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తే సర్దుబాటు ప్రక్రియ ద్వారా వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన జారీ చేస్తే జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కొలువుల్లో 30 శాతం మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 70 శాతం ఉపాధ్యాయ కొలువులను పదోన్నతుల ద్వారా కల్పిస్తారు. ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు అమలయ్యే సూచనలు ఇప్పట్లో అగుపించడం లేదు.
ప్రశ్నార్థకంగా యూపీ పాఠశాలలు...
విద్యార్థికి క్షేత్ర స్థాయిలో మెరుగైన విద్య అందితే ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యాశాఖ చర్యలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తే యూపీ పాఠశాలల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియ ద్వారా ఉపాధ్యాలను నియమించడం కాకుండా ఆయా స్థానాల్లో విద్యావలంటీర్లను నియమించాలన్న డిమాండ్ నెలకొంది. దీని ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఉపక్రమించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment