పునాదికే నాలుగేళ్లు.. గోపురానికి ఇంకెన్నాళ్లో!
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని గాలి గోపురం నాలుగేళ్ల క్రితం కూలిపోయింది. రెండేళ్లలో దాన్ని పునర్ నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. నాలుగేళ్లు గడిచినా పునాదులు కూడా దాటని పరిస్థితి. పనులు నత్తనడకన సాగుతుండడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: పరమశివుని దర్శనానికి ముందు ఆరుగురిని దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. గోపురం, శిఖరం, ఆలయ ద్వారం, ప్రాకారం, బలి పీఠం, అర్చకుడిని దర్శించుకున్న తర్వాత శివుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందనేది నమ్మకం. దీనికి సంబంధించిన స్తోత్రాన్ని కూడా అర్చకులు భక్తులకు వినిపిస్తుంటారు.
శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న గాలిగోపురం 2010 మే 26వ తేదీన కూలిపోవడంతో ఆ దర్శనం భక్తులకు కరువైంది. కూలిపోయి నాలుగేళ్లు అవుతున్నా కేవలం పునాది పనులు మాత్రమే పూర్తి చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గాలిగోపురం పనులకు శంకుస్థాపన చేసి, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రూ.46 కోట్ల వ్యయంతో గోపురం నిర్మాణాన్ని 16 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పేర్కొన్నారు. 48 నెలలు అయినా పనులు నత్తనడకన సాగుతున్నాయి.
1516లో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశ దండయాత్ర ముగించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆశీస్సుల కోసం వచ్చి మూడేళ్లపాటు శ్రమించి ఏడు అంతస్తులతో, 135 అడుగుల ఎత్తుతో గాలిగోపురం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. రాయల హయాంలో నిర్మించడం వల్ల ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా గోపురానికి ముందుభాగంలో ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తికే తలమానికంగా ఉన్న ఈ గోపురం 15 కిలోమీటర్ల వరకు కనిపించేది. అది కూలిపోవడంతో శ్రీకాళహస్తి బోసిపోయింది. పునర్ నిర్మించేందుకు నవయుగ కన్‌స్ట్రక్షన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పునాదుల అనంతరం ఏడాదిపాటు పనులు జరగలేదు. ఇటీవల తిరిగి ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి.
నాలుగు దశల్లో పునాది పనులు..
నాలుగు దశల్లో 39.5 అడుగుల పునాదుల పనులు మాత్రమే చేపట్టారు. మొదట దశలో ఎర్రగుల్ల, రెండో దశలో వెట్‌మిక్చర్, మూడో దశలో సిమెంట్ కాంక్రీటు, నాలుగో దశలో కాశిరాళ్ల పనులు చేపట్టినట్లు ఇంజనీరింగ్ సిబ్బంది వెల్లడించారు. పునాదులు భూమి మట్టానికి చేరుకున్నాయి. ఇక పై భాగంలో చిత్రవనం పనులు (గోపురంపనులు) చేయాల్సి ఉంది. ఇందుకోసం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్దనున్న కోటప్పకొండ క్వారీల నుంచి నల్లరాళ్లను తీసుకువస్తున్నారు. నిర్మాణంలో సున్నపురాయితోపాటు బెల్లం, కరక్కాయి వంటి వాటిని వాడనున్నారు.
శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నీడ కరువు
గాలిగోపురాన్ని నిర్మించిన విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నాలుగేళ్లుగా నీడ కరువైంది. రాజగోపురం కూలిపోవడంతో అక్కడున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని సుపథ మండపం వద్ద ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. విగ్రహం వద్ద ఆయన వివరాలు కూడా నమోదు చేయలేదు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.