వెంటాడుతున్న స్వైన్ ఫ్లూ
కడప రూరల్: స్వైన్ ఫ్లూ భయూలు జిల్లా వాసులను వెంటాడుతున్నారుు. బుధవారం ప్రొద్దుటూరులో మరొకరిలో వ్యాధి లక్షణాలు కనిపించారుు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వారి సంఖ్య మూడుకు చేరింది. విషయం తెలియగానే వైద్య బృందం హుటాహుటిని వెళ్లి జాగ్రత్తలు చేపట్టింది. జనవరికి ముందు కడప నగరంలోని ఆర్‌కే నగర్, ప్రకాశ్‌నగర్‌లలో ఒక్కొక్కరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి.
వారు తక్షణమే హైదరాబాదులో చికిత్స పొందడంతో ఆరోగ్యం కుదుటపడింది. జిల్లాలో వ్యాధి సోకిన ఆ ముగ్గురు కూడా హైదరాబాదులో బంధువుల వద్ద ఉండి వచ్చిన తర్వాతనే లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు అంటున్నారు.
ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన డీఎంహెచ్‌ఓ
ఈ వ్యాధికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రొద్దుటూరులో వ్యాధి లక్షణాలు బయటపడగానే డీఎంహెచ్‌ఓ ఒక అత్యవసర బృందాన్ని అక్కడికి పంపారు. అవసరమైన తక్షణ చర్యలు చేపట్టడానికి సిబ్బందిని సిద్ధం చేశారు. ముందస్తు జాగ్రత్తగా 100 ట్యామిఫ్లూ మాత్రలను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే కడప రిమ్స్‌లో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. చలి తీవ్రంగా ఉండడంతో అంతటా వైరస్ వ్యాపిస్తోందని, చలి తీవ్రత తగ్గి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగితే వైరస్ కనుమరగవుతుందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ స్వైన్‌ఫ్లూ కారణంగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పుకార్లను అసలు నమ్మవద్దని సూచిస్తున్నారు. జిల్లాకు ఈ వైరస్ ఎలాంటి పరిస్థితిలో రాదని వైద్యులు అంటున్నారు. కాగా, ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే సూచనలు, సలహాల కోసం తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు.
ఆందోళన అవసరం లేదు
స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ మన జిల్లా వాతావరణానికి ఇమడదనే చెప్పవచ్చు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జులుబు, జ్వరం, గొంతునొప్పి, ఆయాసం, శ్వాస సంబంధిత ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తాయి.
అలాంటి వారు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తగా ట్యామిఫ్లూ మాత్రలను అందుబాటులో ఉంచాం. ఇతర ప్రాంతాలకు వెళ్లే జిల్లా వాసులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే జిల్లాకు వచ్చేవారు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వ్యాధికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. జిల్లా వాసులు పుకార్లను నమ్మవద్దు.
- నారాయణ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వెఎస్సార్‌జిల్లా