శ్రీకాకుళం టౌన్/కొత్తూరు : ఉపాధి నిధులతో పచ్చతోరణం కార్యక్రమానికి అమర్చిన బోర్డుల అమరికపై సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. పచ్చతోరణం వద్ద అమర్చనున్న బోర్డులకు నిబంధనలు ప్రకటించడంతో పాటు డీఈఈ స్థాయి అధికారి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఆర్.కూర్మనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సాక్షిలో ఈ నెల 24న కథనం ప్రచురితం కావడంతో ఆ శాఖలో కదలిక వచ్చింది. ఈ నెల 26న కొత్తగా ఆదేశాలు జారీ చేస్తూ ప్రాజెక్టు డెరైక్టర్ కూర్మనాథ్ లేఖాంశానికి కథనం ప్రచురితమైన తేదీ కంటే ముందు జారీ చేసినట్టు లేఖలో ఈ నెల 16వ తేదీని పొందుపరచడం విశేషం.
అయితే బోర్డు కచ్చితంగా 10గేజి బరువు కలిగి ఉండాలని, 3 ప్లస్2 సైజ్‌లో పసుపు రంగు వేసిన స్టాండ్‌తో ఉన్న బోర్డుపై నల్లని అక్షరాలతో పూర్తి వివరాలు రాయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బోర్టు ఏర్పాటుకు మాత్రం రూ.5వేలుగా నిర్థారించి బోర్డుకు కింద సిమ్మెంటు దిమ్మలు కట్టాలని కొత్త రూల్‌ను పొందుపరిచారు. దీనికితోడు బోర్టులు అమర్చిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ డీఈఈ పరిశీలించిన తర్వాత బిల్లులు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనికి తోడు కాంట్రాక్టరుకే పనులు అప్పగించడం కాకుండా స్థానికులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే వారికి అవకాశం ఇవ్వాలన్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభ్యర్థనను మెమోలో పేర్కొనడం విశేషం. ఏది ఏమైనా అధికారుల్లో చలనం రావడం వల్ల పనిలో నాణ్యత పెరిగే అవకాశం ఉందని పలువురు బావిస్తున్నారు.
క్వాలిటీ పరీక్షల తర్వాతే బిల్లులు
Published Thu, Dec 31 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement