గాజు పరికరాన్ని చూపిస్తున్న అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: బంకుల్లో పెట్రోల్, డీజిల్ తూకం, నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకం గా ఉండేందుకు తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా గాజుతో తయారు చేసిన 5 లీటర్ల ఓ కొత్త జార్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గాజు జార్‌ను యుఎస్‌పీ టైప్ క్లాస్–ఏతో తయారు చేశారు. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడటంతోపాటు సరైన తూకాన్ని సూచిస్తుంది. ఈ జార్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.
సోమవారం పౌరసరఫరాల భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలతో జరిగిన సమావేశంలో ఈ పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ పరికరాలను ఆయా పెట్రోల్ బంక్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని సూచించారు. వీటిని వినియోగించేందుకు తూనికల కొలతల శాఖ నుంచి ధ్రువీకరణపత్రం పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, హెచ్‌పీసీఎల్ డీజీఎం (రిటైల్) రాజేశ్, బీపీసీఎస్ మేనేజర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment