సాక్షి, అమరావతి: లైంగికదాడికి గురైన బాధితులెవరైనా ఆస్పత్రికి వస్తే.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్ని బోధనాస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు ఏ సమయంలో వెళ్లినా డాక్టర్లు అందుబాటులో లేరనే సమస్య ఉత్పన్నం కాకూడదని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా ఆస్పత్రి సూపరింటెండెంట్ చూసుకోవాలని ఆదేశించారు. బోధనాస్పత్రులకు వచ్చే లైంగిక దాడుల బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని కూడా సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి బాధితుల కోసం తాజాగా ‘దిశ’ చట్టం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. బాధితులు వైద్యపరీక్షల కోసం ఆస్పత్రులకు వస్తే వారికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లుగానీ, పోలీసు కేసులతో సంబంధం లేకుండా బాధితురాలు ఆస్పత్రికి వచ్చిన వెంటనే గైనకాలజిస్టు్టతోపాటు, ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉండి, నమూనాలు సేకరించి, ఆ నివేదికను పోలీసులకు అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇలాంటి బాధితుల కోసం బోధనాస్పత్రిలో ప్రసూతి వార్డుకు అనుబంధంగా ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైతే ఇన్‌పేషెంటుగా చేర్చి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఒక మానసిక వైద్య నిపుణుడు, న్యాయనిపుణుడు కూడా అందుబాటులో ఉండి, వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. బాధితురాలి నుంచి సేకరించిన రక్తనమూనాలను పరీక్షించి 6 గంటల్లోగా నివేదిక ఇస్తారు.
వైద్యపరీక్షల్లో అంతరాయం ఉండదు
బాధితురాలు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిందంటే పోలీసు కేసులు, ఎఫ్‌ఐఆర్ లాంటివేవీ అడగకూడదు. వచ్చిన వెంటనే వారి స్టేట్‌మెంట్ తీసుకుని వైద్యపరీక్షలు నిర్వహించి ఆ నివేదికను పోలీసులకు ఇవ్వాలి. అదే రోజు ఫోరెన్సిక్ రిపోర్టు రాదు కాబట్టి పెండింగ్ ఎఫ్‌ఎస్‌ఎల్ అన్నే పేరుతో డాక్టరు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేస్తారు. ప్రతి బోధనాస్పత్రిలో దీనికోసం ప్రత్యేక భవనాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరులో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం.
– డా.కె.వెంకటేష్, వైద్య విద్యాసంచాలకులు
లైంగికదాడి బాధితులకు సత్వర వైద్యం
Published Thu, Jan 2 2020 4:48 AM | Last Updated on Thu, Jan 2 2020 4:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment