గుట్టుగా గుట్కా దందా..!
Published Fri, Oct 18 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
సాక్షి, నిజామాబాద్ :జిల్లాలో గుట్కా దందా గుట్టుగాసాగుతోంది. ప్యాకింగ్‌లో మా ర్పులు చేసి విక్రయిస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలను తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు, శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని గుట్కా నిల్వలను డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రిటైల్ వ్యాపారులకు రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. హోల్‌సేల్ కిరాణాషాపులకు, పాన్‌షాపులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి, ఆర్మూ ర్, బోధన్, బాన్సువాడ తదితర పట్టణాలకు కూడా గుట్కా ప్యాకెట్లు రవాణా అవుతున్నాయి.
ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా విక్రయాలపై నిషేధం విధించింది. ఆరోగ్యానికి ఎంతో హాని చేసే ఈ గుట్కా తింటూ అనేక మంది గొంతు క్యాన్సర్ తదితర వ్యాధుల భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ గుట్కా మహమ్మారి బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా విక్రయాలకు చెక్‌పెట్టాలని నిర్ణయించింది. ఇదే అక్రమార్కులకు కలిసొస్తోంది. ఒకసారి గుట్కాకు అలవాట పడిన వ్యక్తి మానడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దండుకుంటున్నారు. నిషేధం ఉందంటూ గుట్కా రేట్లను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. జిల్లాలో ప్రతిరోజు లక్షల రూపాయల్లో ఈ గుట్కా వ్యాపారం కొనసాగుతోందని అంచనా.
నగరానికి చెందిన ఓ వ్యాపారి కొందరు యువకులను నియమించుకుని జిల్లాలో పలుచోట్లకు గుట్కా నిల్వలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కాలపై నిషేధం లేనప్పుడు జిల్లాలో పలుచోట్ల ఏకంగా గుట్కా తయారీ పరిశ్రమలే వెలిశాయంటే ఏమేరకు ఈ దందా కొనసాగేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిషేధం అమలులోకి రావడంతో ఈ యూనిట్లు మూతపడ్డాయి. కానీ దందా మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.
చిరు వ్యాపారులపైనే కేసులు..
పోలీసులు అడపాదడపా కిరాణాషాపులు, పాన్‌షాపుల్లో తనిఖీలు చేసి గుట్కా పాకెట్లను పట్టుకుంటున్నారు. చిరువ్యాపారులపై కేసులు నమోదు చేసి, వేల రూపాయల్లో జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వీటిని సరఫరా చేస్తున్న బడా వ్యాపారులపై, గుట్కా రాకెట్‌పై దృష్టి పెట్టకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. నేతల అండదండలుండటంతోనే గుట్కా దందా చేస్తున్న వ్యాపారుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు గుట్కా స్థావరాలపై నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement