చేప కాదు.. తిమింగలం!
- ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్ ఎం.గంగాధరం అరెస్ట్
- ఆదాయానికి మించి ఆస్తులు ఆర్జించారని ఏసీబీ దాడులు
- రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.8.5 కోట్ల ఆస్తుల గుర్తింపు
- మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.100 కోట్లు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బి)శాఖ చీఫ్ ఇంజనీర్(అడ్మినిస్ట్రేషన్) ఎం.గంగాధరంను శనివారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, హైదరాబాద్, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై 20 ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లో విలువైన డాక్యుమెంట్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, బంగారం, నగదు, బ్యాంకు లాకర్ల కీ లను స్వాధీనం చేసుకున్నారు. గంగాధరం, ఆయన బినామీల ఆస్తుల విలువ(రిజిస్ట్రేషన్ ప్రకారం) రూ.8.5 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్‌పీ ఠాకూర్ వెల్లడించారు.
ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడ, వైఎస్సార్ కడప, చిత్తూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో పలు స్థిరాస్తులను గుర్తించినట్టు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు లాకర్లను సోమవారం తనిఖీ చేస్తామన్నారు. గంగాధరంను ఆరెస్టు చేశామని, సోమవారం విశాఖలోని ఏసీబీ కోర్టుకు హాజరు పరిచి దర్యాప్తు కొనసాగిస్తామని వివరించారు. కాగా, ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు ప్రారంభించిన గంగాధరం 2016 నుంచి విజయవాడలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఆయన తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, కడప, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో పని చేశారు. కాగా, – హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సర్కిల్ వివేకానందనగర్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 14పై శనివారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ ఏపీ జాయింట్ డైరెక్టర్ మోహన్‌రావు, డీఎస్పీ రామకృష్ణారెడ్డి బృందం దాడులు నిర్వహించింది. గంగాధరంను అరెస్ట్ చేసి విశాఖపట్నం తరలించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 11 ప్రదేశాల్లో దాడులు కొనసాగాయి.