బాబు పాలనలో పక్షపాత దాడులు! | TDP Politically motivated attacks By ACB Support | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో పక్షపాత దాడులు!

Published Sat, Jun 8 2019 4:36 AM | Last Updated on Sat, Jun 8 2019 12:55 PM

TDP Politically motivated attacks By ACB Support - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాజకీయ ప్రేరేపిత దాడులకు ఉపకరణంలా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్పీ ఠాకూర్‌ ఏసీబీ డీజీగా ఉండగా ఆయన్ను అడ్డు పెట్టుకుని మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు పక్షపాత దాడులకు ప్రేరేపించారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో ఏసీబీ సాగించిన దాడుల పూర్వాపరాలపై పునర్విచారణకు ఆదేశిస్తే అక్రమాల గుట్టు రట్టవుతుందని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు జమానాలో సొంత సామాజికవర్గం జోలికి పోకుండా అట్టడుగు వర్గాలు, గిట్టని అధికారులను ఏసీబీ ద్వారా టార్గెట్‌ చేసే వికృత క్రీడ యథేచ్చగా సాగింది. లంచం కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు టీడీపీ నేతలకు సెటిల్మెంట్లు సాగించే రాజకీయ దందాలుగా మారాయి. ఏసీబీ పక్షపాత దాడులపై కొన్ని ఉదంతాలు గమనిస్తే వాస్తవాలు ఏమిటో బోధపడతాయి.

పక్షపాత దాడులకు ఇవిగో ఉదాహరణలు..
- టీడీపీ అధికారంలో ఉండగా గుంటూరు పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(పీటీసీ) డీఎస్పీ దుర్గాప్రసాద్‌ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడనే నెపంతో రాయపాటి సాంబశివరావు వర్గీయులు లోకేశ్‌ ద్వారా ఒత్తిడి తెచ్చి ఏసీబీ దాడులు చేయించారు. గుంటూరు కన్నావారి తోటలోని దుర్గాప్రసాద్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చడం కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం. చంద్రబాబు, లోకేశ్‌ ఒత్తిడితో ఠాకూర్‌ దూకుడు పెంచి ఈ కేసులో మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇరికించేందుకు తీవ్రంగా యత్నించారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఆళ్లను ఏసీబీ కేసులో ఇరికించేందుకు టీడీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఓ సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు ఏసీబీని వాడుకున్నారనేందుకు నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డిపై అక్రమ కేసుల ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎస్సై నుంచి డీఎస్పీగా పనిచేసిన పోలీస్‌స్టేషన్‌లోనే టీడీపీ సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు చివరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించడం గమనార్హం. 
విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శోభన్‌బాబుపై జరిగిన ఏసీబీ దాడి కక్ష సాధింపులకు పరాకాష్ట. ఆయన లంచం తీసుకోవడం గానీ డిమాండ్‌ చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు సాక్షాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఏసీబీ వైఖరితో తీవ్ర మనస్తాపం చెందిన సీఐ శోభన్‌బాబు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వెలుగులోకి రావడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఏసీబీ కక్షపూరితంగా దాడులు చేస్తోందని పేర్కొంటూ తన నిజాయితీని నిరూపించుకునేందుకు పోలీస్‌స్టేషన్‌ వద్ద సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని కోరుతూ శోభన్‌బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడటంతో ఉలిక్కిపడ్డ ఏసీబీ అప్పటికప్పుడు ఐదుగురు అధికారుల బృందాన్ని విమానంలో పంపించి ఆయన్ను బుజ్జగించి కేసును ఉపసంహరించుకుంది. 
టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే, సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులపై ఏసీబీ కన్నెత్తి చూసే సాహసం చేయలేదని చెప్పేందుకు చిత్తూరు జిల్లా స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్‌ ఉదంతమే నిదర్శనం. ప్రస్తుతం పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల సమన్వయ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌కు ఆయన ప్రియ శిష్యుడు. రామ్‌కుమార్‌ ఆదాయానికి మించి రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందినా ఎలాంటి సోదాలు చేయలేదు. నాడు మంత్రిగా ఉన్న లోకేశ్‌ రంగంలోకి దిగి రామ్‌కుమార్‌ జోలికి వెళ్లకుండా జీఏడీ నుంచి ‘నో పర్మిషన్‌ ఎకార్డెడ్‌’ ఉత్తర్వులు జారీ చేయించి కాపాడారు. పార్టీ ఫిరాయింపులతోపాటు ఇటీవల ఎన్నికల్లో రామ్‌కుమార్‌ టీడీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి.

టీడీపీ పెద్దల సెటిల్మెంట్లు
గత మూడున్నరేళ్లుగా ఏసీబీ పెద్దఎత్తున దాడులు నిర్వహించింది. అవినీతి అధికారుల ఆట కట్టించడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకున్నా టీడీపీ కక్ష సాధింపు చర్యలకు ఏసీబీ సహకరించడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో టీడీపీ పెద్దలే సెటిల్మెంట్లు చేసి కాసులు ఏరుకున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో చిక్కిన అధికారుల ఆస్తుల్లో 30 నుంచి 50 శాతం వరకు తమ పేర రాయించుకున్నట్టు సమాచారం. సెటిల్మెంట్‌ కేసుల్లో సలహాదారుగా వ్యవహరించిన హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ ఒకరు శాఖాపరమైన విచారణతో సరిపెట్టేలా చేశారనే విమర్శలున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తొలుత నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన ఆస్తుల వివరాలకు, విచారణ తదుపరి నమోదు చేసే డ్రాఫ్ట్‌ ఫైనల్‌ రిపోర్ట్‌(డీఎఫ్‌ఆర్‌)లో పేర్కొన్న ఆస్తుల వివరాలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రేరేపిత ఏసీబీ దాడుల్లో బలహీనవర్గాలే బాధితులుగా మారిన నేపథ్యంలో గత ఐదేళ్లుగా సాగిన ఏసీబీ దాడులు, కేసులపై పునర్విచారణ చేస్తే అక్రమాలు, అవినీతి, అవకతవకలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement