కోవూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన రచ్చబండ సోమవారం కోవూరులో రచ్చరచ్చగా ముగిసింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య తూతూ మంత్రంగా జరిగింది. కోవూరులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో రచ్చబండ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి ప్రసంగం ప్రారంభించగానే సీపీఎం నాయకులు నిరసన తెలిపి అడ్డుకున్నారు. మండలంలో ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే వాటిని పరిష్కరించలేని రచ్చబండ ఎందుకని నిలదీశారు. కోవూరు చక్కెర కర్మాగారానికి చెరకు రవాణా చేసిన రైతులకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయని, ఆ కర్మాగారంపై ఆధారపడి పది వేల రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, తొలుత ఆ సమస్యను పరిష్కారించాలని మంత్రిని ఘెరావ్ చేశారు. ఈ కర్మాగారం మీద దాదాపు 500 మంది కార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. గతంలో జాతీయ అవార్డు పొందిన కోవూరు చక్కెర కర్మాగారం తుప్పు పట్టి పైసాకు కూడా పనికి రాకుండా పోతోందన్నారు. దీనికి ప్రభుత్వం, యాజమాన్యమే కారణమన్నారు.
చక్కెర కర్మాగారం నుంచి కోట్లాది రూపాయలు కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయన్నారు. కర్మాగారం ఓవరాలింగ్ పనులకు నిధులు లేక క్రషింగ్ ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. 2013-14 సీజన్‌కు కర్మాగార పరిధిలో సుమారు 2.5 లక్షల టన్నులు చెరకు సాగుచేసి గానుగ ఆడుటకు సిద్ధంగా ఉందన్నారు. కాని వీటి అన్నింటిని పర్యవేక్షించేందుకు ఎండీ కాని, సమాన క్యాడర్ కలిగిన ఏ ఒక్కరు లేకపోవడం దారుణమన్నారు. ఇన్ని సమస్యలతో కర్మాగారాన్ని ఎలా నిర్వహించాలో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల స్థలాలు ఇస్తామని కోట్లాది రూపాయలు వెచ్చించి 13 ఎకరాలు కొనుగోలు చేసి నిరుపయోగంగా వదలివేశారని మండిపడ్డారు. తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు.
అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే విలాసవంతమైన జీవితాలతో కాలం వెళ్లదీస్తున్నారంటూ దుయ్యబట్టారు. సీపీఎం నాయకుల రచ్చరచ్చతో సభాప్రాంగణంలో కొంత అలజడి చోటు చేసుకుంది. మంత్రి ఆదేశంతో పోలీసులు సీపీఎం కార్యకర్తలను ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు.
రచ్చబండ రసాభాస
Published Tue, Nov 26 2013 2:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement