racha banda program
-
రచ్చగా ముగిసిన ‘రచ్చబండ’
సాక్షి, తిరుపతి: రచ్చబండ కార్యక్రమం జిల్లాలో రచ్చ రచ్చగా జరిగింది. ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగిన ర చ్చబండకు పలు చోట్ల సమైక్య సెగ తగిలింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమాలు ఒక మోస్తరుగా జరిగినా మిగి లిన సమావేశాలు మాత్రం తూతూమంత్రంగా సాగాయి. కొన్ని చోట్ల దరఖాస్తులు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు విడతలుగా పర్యటిం చి, మూడు ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి గల్లా అరుణ కుమారి తిరుచానూరులోని అర్బ న్ హట్లో రచ్చబండ కార్యక్రమం చేపట్టగా, గత హామీలను ప్రశ్నించేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరిలో రచ్చబండను నిర్వహించడానికి ముందే వైఎస్ఆర్ సీపీ నాయకులు కొటాల చంద్రశేఖ ర్ రెడ్డి, యుగంధర్ రెడ్డిని అరెస్టు చేశా రు. తిరుపతి ఎంపీ చింతా మోహన్‌కు వెళ్లిన ప్రతి చోటా సమైక్య సెగ తగి లింది. నాగలాపురం, పిచ్చాటూరులో ఆయన పాల్గొనగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే పరిస్థితి తిరుపతిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలోను ఎంపీకి ఎదురయింది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన జరిగిన రచ్చబండలో ముందు తమ సమస్యలు వినాలంటూ ప్రజలు పట్టుబట్టడంతో ఎంపీ అర్ధంతరంగా వెనుదిరిగారు. దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి విడుదల చేశారు. ఎంపీపై వాటర్ బాటిల్ విసిరారనే ఆరోపణపై మరో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీదేవి టేబుల్‌పైకి ఎక్కి వీరంగం చేసినా, ఆమెపై కేసు నమోదు చేయలేదు. అధికార పార్టీ నిర్వహించిన అన్ని రచ్చబండ కార్యక్రమాల్లోను తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. కాగా పుత్తూరులో రూ.25 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా, ప్రారంభించక పోవడంతో నగిరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడును స్థానికులు రచ్చబండలో అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారంటూ ప్రజలు ఆరోపించడంతో, ముద్దుకృష్ణమ నాయుడు వెళ్లి ఆ బ్రిడ్జిని ప్రారంభించారు. కలెక్టర్ రాంగోపాల్ రచ్చబండ షెడ్యూలును ముందుగా ప్రకటించినా, దాని ప్రకారం అధికారులు కార్యక్రమాలు నిర్వహించలేదు. -
మొక్కుబడిగా రచ్చబండ..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్‌లో అభాసుపాలైంది. మొదటి, రెండో విడత కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులను పరిష్కరించకుండా, మూడో విడత అంటూ వచ్చిన యంత్రాంగానికి ప్రజలు ముచ్చెమటలు పట్టించారు. ప్రజా వ్యతిరకేతను ముందే ఊహించిన మం త్రులు కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలీసు భద్రతతో పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ కేవలం తన నియోజకవర్గం లో ని కార్యక్రమానికే పరిమితంకాగా, మరో మంత్రి దానం నాగేందర్ నగరంలోనే ఉన్నా ఒక్క కార్యక్రమంలోనూ పా ల్గొనలేదు. ఇక, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి గీతారెడ్డి అసలు ఇటువైపే చూడలేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్ ప్రాంతాల్లోనూ ఇదే తంతు కొనసాగింది. అన్నిచోట్లా రచ్చ.. రచ్చ గొడవలు, వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు, అరెస్టులు.. ఇదీ రచ్చబండ కార్యక్రమాల్లో కనిపించిన సాధారణ దృశ్యం. కొన్నిచోట్ల తెలంగాణవాదులు రచ్చబండ ఫ్లెక్సీలపై సీఎం బొమ్మను చించివేసిన ఘటనలతో ఉద్రిక్తత నెలకొంది. మరికొన్ని చోట్ల ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల వంటి వాటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. ఆయా సందర్భాల్లో ఉద్రిక్తత సైతం నెలకొంది. ప్రజాప్రతినిధులను అడ్డుకున్న ఘటనలతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇక, పలుచోట్ల ఆయా పథకాల కోసం ప్రజలు పెద్దసంఖ్యలో దరఖాస్తులను సమర్పించారు. గంటల తరబడి వరుసలో నిల్చుని దరఖాస్తులు ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డారు. కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇంకొన్ని చోట్ల జనం లేక కార్యక్రమాలు వెలవెలబోయాయి. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లాలో ఇలా.. రచ్చబండ తేదీలు: నవంబరు 11-26 జరిగిన నియోజకవర్గాలు: 16 మొత్తం కార్యక్రమాలు: 39 రేషన్‌కార్డుల దరఖాస్తులు: 36,548 పింఛన్ల కోసం..: 2,292 రేషన్‌కార్డుల పంపిణీ: 33,431 పింఛన్లు: 11,122 -
రచ్చబండ రసాభాస
కోవూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన రచ్చబండ సోమవారం కోవూరులో రచ్చరచ్చగా ముగిసింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య తూతూ మంత్రంగా జరిగింది. కోవూరులోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో రచ్చబండ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి రామనారాయణరెడ్డి ప్రసంగం ప్రారంభించగానే సీపీఎం నాయకులు నిరసన తెలిపి అడ్డుకున్నారు. మండలంలో ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే వాటిని పరిష్కరించలేని రచ్చబండ ఎందుకని నిలదీశారు. కోవూరు చక్కెర కర్మాగారానికి చెరకు రవాణా చేసిన రైతులకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయని, ఆ కర్మాగారంపై ఆధారపడి పది వేల రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, తొలుత ఆ సమస్యను పరిష్కారించాలని మంత్రిని ఘెరావ్ చేశారు. ఈ కర్మాగారం మీద దాదాపు 500 మంది కార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. గతంలో జాతీయ అవార్డు పొందిన కోవూరు చక్కెర కర్మాగారం తుప్పు పట్టి పైసాకు కూడా పనికి రాకుండా పోతోందన్నారు. దీనికి ప్రభుత్వం, యాజమాన్యమే కారణమన్నారు. చక్కెర కర్మాగారం నుంచి కోట్లాది రూపాయలు కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయన్నారు. కర్మాగారం ఓవరాలింగ్ పనులకు నిధులు లేక క్రషింగ్ ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. 2013-14 సీజన్‌కు కర్మాగార పరిధిలో సుమారు 2.5 లక్షల టన్నులు చెరకు సాగుచేసి గానుగ ఆడుటకు సిద్ధంగా ఉందన్నారు. కాని వీటి అన్నింటిని పర్యవేక్షించేందుకు ఎండీ కాని, సమాన క్యాడర్ కలిగిన ఏ ఒక్కరు లేకపోవడం దారుణమన్నారు. ఇన్ని సమస్యలతో కర్మాగారాన్ని ఎలా నిర్వహించాలో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల స్థలాలు ఇస్తామని కోట్లాది రూపాయలు వెచ్చించి 13 ఎకరాలు కొనుగోలు చేసి నిరుపయోగంగా వదలివేశారని మండిపడ్డారు. తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే విలాసవంతమైన జీవితాలతో కాలం వెళ్లదీస్తున్నారంటూ దుయ్యబట్టారు. సీపీఎం నాయకుల రచ్చరచ్చతో సభాప్రాంగణంలో కొంత అలజడి చోటు చేసుకుంది. మంత్రి ఆదేశంతో పోలీసులు సీపీఎం కార్యకర్తలను ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. -
సీఎం సాక్షిగా కాంగ్రెస్ సభలా.. రచ్చబండ
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రచార పర్వాన్ని భుజానెత్తుకుంది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండను సొంత బహిరంగసభలా చేపట్టారు. సోమవారం రాయచోటిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఇన్చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగించారు. కాంగ్రెస్ నేతలు మాకం అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నేత హరిప్రసాద్, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి, సీఎం సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులతోపాటు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఎర్రగుడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి లాంటి వారితో సభా వేదిక నిండుకుంది. కలెక్టర్‌లాంటి జిల్లా అత్యున్నత అధికారిని సైతం రెండవ వరుసకు పరిమితం చేశారు. కాంగ్రెస్ మార్క్ పెత్తనం : జిల్లా అధికారులపై ఇన్చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ మార్క్ పెత్తనాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్ద జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్, డీఐజీ మురళీకృష్ణ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంతలో మంత్రి మహీధర్‌రెడ్డి వాహనం దూసుకురాగా పోలీసు అధికారులు అడ్డుచెప్పారు. తన వాహనాన్నే అడ్డుకుంటారా నేనెవరో తెలియదా? అంటూ ఇన్చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి ఆగ్రహోదగ్ధులయ్యారు. జిల్లా ఎస్పీపై వార్నింగ్ తరహాలో పదజాలాన్ని ఉపయోగించారు. అంతలో అక్కడికి చేరుకున్న కలెక్టర్ శశిధర్‌తో నేనెవరో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నారా అని ధ్వజమెత్తారు. -
తెలంగాణ వ్యతిరేక సీఎం మనకొద్దు :కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి మ నకు అవసరం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమె నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిం చడం తగదన్నారు. వేయి మంది తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కాబోతుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించడం ఖాయమన్నారు. హైదరాబాద్ రాజధానిగా భద్రాచలంతో కూ డిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుం దని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటయ్యాక ప్రస్తుతమున్న *200ల పింఛన్‌ను వేయి రూపాయలకు పెంచుతామన్నారు. భువనగిరి పట్టణ అభివృద్ధి కుంటు పడిం దని, దానిని అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఎలి మినేటి ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం కేవలం అధికార పార్టీ ప్రచారం కోసమే తప్ప దీని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పాల కులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు బంగారు తల్లి బాండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆర్డీఓ ఏపూరు భా స్కర్‌రావు, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, తహసీల్ధార్ ధర్మయ్య, ఎంఈ ఓ బండారు రవివర్దన్, రచ్చబండ కమి టీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. సీఎం ఫొటో తొలగింపు రచ్చబండ వేదికపై అధికారులు ఏర్పా టు చేసిన సీఎం బొమ్మ ఉన్న ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు. సీఎం ఫొటోను తొలగించి ఆ స్థానంలో ఉప ముఖ్యమం త్రి దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రచ్చబండ బ్యానర్‌పై కూడా సీఎం బొమ్మ ఉండవద్దని బీజేపీ, జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. -
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు
మేడ్చల్, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఆయన వ్యవహారశైలిపై నిరసన వ్యక్తమవుతోంది. ఇందుకు రచ్చబండ కార్యక్రమం వేదికవుతోంది. మేడ్చల్‌లో బుధవారం రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో రభసకు దారితీ సింది. వేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో పాటు ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఫొటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేఎల్లార్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడటానికి ఉపక్రమిస్తుండగా తెలంగాణవాదులు గొడవ ప్రారంభించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీశ్యాంరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు టీడీపీకి చెందిన సర్పంచ్‌లు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను చించేందుకు ప్రయత్నించా రు. సీఐ రాంరెడ్డి వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకునిఅదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు సత్యనారాయణ సభా ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. జై తెలంగాణ, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని సభనుంచి బయటకు పంపించివేశారు. ఇంతలోనే టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విష్ణుచారి, నాయకుడు రవీందర్‌తో తదితరులు వేదిక వెనుకవైపు నుంచి వచ్చి ఫ్లెక్సీని లాగేశారు. దీంతో పోలీసులు వారినుంచి ఫ్లెక్సీని తీసుకునేందుకు యత్నించగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఫ్లెక్సీని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీని తీసుకొని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో కన్పించకుండా ఓ పోస్టర్ అతికించి కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా మళ్లీ గొడవ జరుగుతుందేమోననే అనుమానంతో పోలీసులు రచ్చబండ ఫ్లెక్సీకి కార్యక్రమం పూర్తయ్యే వరకూ బందోబస్తుగా నిలిచారు. -
రచ్చబండ రసాభాస
అనకాపల్లి అర్బన్, అనకాపల్లి రూరల్ న్యూస్‌లైన్: మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన రచ్చబండ రసాభాసగా సాగింది. మూడు నెలలుగా జీతాలందుకోని జోనల్ పరిధి ఉపాధ్యాయులు రచ్చబండ వేదికపైకి వెళ్తున్న మంత్రి గంటాను నిలదీశారు. మహా విశాఖపట్నంలో అనకాపల్లి విలీనమైనప్పటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదని, హెల్త్‌కార్డులు మంజూరులోనూ తీరని అన్యాయం జరుగుతోందన్నారు. జోనల్ కమిషనర్‌కు అధికారం లేకపోతే ఉపాధ్యాయుల జీతాలు, ఇంక్రిమెంట్లు, ఇన్‌కంటాక్స్ ఫారాల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. అప్రెంటిస్ పూర్తి చేసుకున్న తొమ్మిది మంది ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఆర్డర్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతను లాక్కెళ్లిన పోలీసులు పట్టణ సమస్యలు, నీలం తుపాను నష్టపరిహారం, చక్కెర కర్మాగారం ఆధునికీకరణ, ఫేజ్-1, ఫేజ్-2 సత్యనారాయణపురం లే అవుట్‌లోని 2551 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ స్థలాలను స్వాధీనం చేయకపోవడంపై టీడీపీ నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యుడు బుద్ద నాగజగదీశ్వరరావు మంత్రిని నిలదీశారు. దీంతో ఆయనను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పట్టణంలోని రోడ్లు, కాలువలు శిథిలమైనా జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు నేతృత్వంలో గంటాకు వినతిపత్రం అందజేశారు. వైఎస్ వల్లే రచ్చబండ విజయం: మంత్రి గంటా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమం వల్లే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం పలువురికి పింఛన్ ధ్రువీకరణ పత్రాలు, హౌసింగ్ పంపిణీ, రేషన్ కార్డులు మంత్రి అందజేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ ఎ.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆరోఖ్యరాజ్, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, జేసీ ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ వసంతరాయుడు, మండల ప్రత్యేకాధికారి అల్లూరి సుబ్బరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కడిమిశెట్టి రాంజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నడిపల్లి గణేష్, న్యాయవాది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
రసాభాసగా ‘రచ్చబండ’
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు మున్సిపాలిటీలో మూడో విడత రచ్చబండ కార్యక్రమం జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదానికి వేదికగా మారింది. ‘మీరెంత అంటే.. మీరెంత’ అంటూ ఇరువర్గాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో మంగళవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ మున్సిపల్ కమిషనర్ రమణాచారి అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. టీ జేఏసీ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. మరోవైపు పేదోళ్లకు కాకుండా ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు నాయకుల మద్దతుదారులకే ఇస్తున్నారంటూ ప్రజలు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా రేషన్‌కార్డు రాలేదని కొందరు.. ఇళ్లు ఇవ్వలేదని మరికొందరు నాయకులను, అధికారులను ప్రశ్నించారు. టీజేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలు, జనాల నిలదీతలో రచ్చబండ గందరగోళంగా మారింది. జనాలంతా ఒక్కసారిగా వేదిక మీదికి దూసుకురావడంతో తోపులాట జరిగింది. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు కిందపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అసలు అక్కడం ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీలో తెలంగాణ ద్రోహి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను ఎందుకు పెట్టారంటూ జేఏసీ నాయకులు వేదికపైకి వెళ్లారు. తెలంగాణకు చెందిన జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ ఫొటో పెట్టాల్సి ఉండేదని.. సీఎం డౌన్ డౌన్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అపూలు జేఏసీ నాయకులకు నచ్చజెప్పే యత్నం చేసినా వారు వినలేదు. తెలంగాణ ద్రోహి సీఎం అంటూ ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపివేశారు. ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన తెలంగాణవాదులు ఈ క్రమంలో ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తుండగా జేఏసీ తాండూరు డివిజన్ చైర్మన్ సోమశేఖర్, మరికొందరు నాయకులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకువచ్చారు. ఇందిరమ్మ పథకం కింద మున్సిపాలిటీకి చెందిన పేదలకు రెండు,మూడో విడతలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు ఐదేళ్లు అవుతున్నా లబ్దిదారులకు స్థలాలు అప్పగించలేదంటూ జేఏసీ నాయకులు ప్రశ్నించారు. ఈ తరుణంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రమేష్‌లు వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకే ఇంత వరకు దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా ఇళ్లు ఇస్తామని మంజూరుపత్రాలు ఇస్తూ పేదలను ప్రభుత్వం మోసం చేస్తోందని వాదనలకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో టీడీపీ మాజీ కౌన్సిలర్ రాజుగౌడ్ జోక్యం చేసుకుంటూ ‘మా ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ఎందుకు అడ్డుతగులుతారంటూ’ జేఏసీ నాయకులను ప్రశ్నించారు. ఇతర టీడీపీ నాయకులు రవిగౌడ్, కరుణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్లూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో జేఏసీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన మున్సిపల్ వార్డులకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఇతరపార్టీల కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన వార్డుల లబ్దిదారులకు స్థలాలు కేటాయించడంలో కావాలనే వివక్ష చూపించారని జేఏసీ చైర్మన్ మండిపడ్డారు. వారికి న్యాయం చేయాలని వేదిక వద్ద బైఠాయించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి పోలీసులతో రంగం ప్రవేశం చేశారు. జేఏసీ చైర్మన్ సోమశేఖర్, ఇతర నాయకులను వేదిక వద్ద నుంచి లాక్కెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వదిలిపెట్టారు. ఆ తర్వాత లబ్దిదారులకు పింఛన్, రేషన్, పొదుపు సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హడావుడిగా ముగించేసి ఎమ్మెల్యే, ఇతర నాయకులు అక్కడినుంచి నిష్ర్కమించారు.