మేడ్చల్, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఆయన వ్యవహారశైలిపై నిరసన వ్యక్తమవుతోంది. ఇందుకు రచ్చబండ కార్యక్రమం వేదికవుతోంది. మేడ్చల్‌లో బుధవారం రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో రభసకు దారితీ సింది. వేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో పాటు ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ ఫొటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేఎల్లార్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడటానికి ఉపక్రమిస్తుండగా తెలంగాణవాదులు గొడవ ప్రారంభించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీశ్యాంరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు టీడీపీకి చెందిన సర్పంచ్‌లు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను చించేందుకు ప్రయత్నించా రు.
సీఐ రాంరెడ్డి వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకునిఅదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు సత్యనారాయణ సభా ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. జై తెలంగాణ, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు వారిని సభనుంచి బయటకు పంపించివేశారు. ఇంతలోనే టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు విష్ణుచారి, నాయకుడు రవీందర్‌తో తదితరులు వేదిక వెనుకవైపు నుంచి వచ్చి ఫ్లెక్సీని లాగేశారు. దీంతో పోలీసులు వారినుంచి ఫ్లెక్సీని తీసుకునేందుకు యత్నించగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. చివరకు టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఫ్లెక్సీని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీని తీసుకొని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో కన్పించకుండా ఓ పోస్టర్ అతికించి కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా మళ్లీ గొడవ జరుగుతుందేమోననే అనుమానంతో పోలీసులు రచ్చబండ ఫ్లెక్సీకి కార్యక్రమం పూర్తయ్యే వరకూ బందోబస్తుగా నిలిచారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు
Published Wed, Nov 20 2013 11:32 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement