పట్టాలు తప్పిన ఆగ్రహం
Published Mon, Nov 25 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో కనుమరుగైన అధికార పార్టీ నాయకులు ప్రజల మధ్యకు రావడానికి ఏర్పాటు చేసిన రచ్చబండ అదే అధికార పార్టీ నాయకులను ఊపిరి తీసుకోనీ యకుండా చేస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడికక్కడ ప్రజల నుంచి ఆగ్రహావేశాలను అధి కార పార్టీ నాయకులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హుల పేర్లు తొలగించ డంతో ఆదివారం బొబ్బిలిలో జరిగిన రచ్చబండ ఆసాంతం నిరసనలు, తోపులాటల మధ్య సాగింది. విజయనగరం ఎంపీ ఝాన్సీ రచబండ సభకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లినంతవరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీపీఎం, రైతు సంఘం, బీజేపీ నేతలు అధికారపార్టీ వైఖరిని ఎండగడుతూ నిరసనలు హోరెత్తించారు.
రచ్చబండ సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌నే గుర్తించని ఈ రచ్చబండ ఎందుకు? మాకు ఇళ్ల పట్టాలిస్తామని తయారు చేసిన లిస్టుల్లో పేర్లు ఉన్నాయి. ఇప్పుడెందుకు లేవు? రచ్చబండ కార్యక్రమం మీ ఇష్టారాజ్యమా? అధికారికంగా ప్రభుత్వం నియమించిన రచ్చబండ కమిటీ సభ్యులు కాకుండా అధికారపార్టీకి చెందిన నాయకులు రచ్చబండ వేదిక మీదకు ఎందుకు? అన్న ప్రశ్నలు రచ్చబండ కార్యక్రమంలో అధికార పార్టీ ఎంపీ,ఇతర నాయకులను ఊపిరి సలపనీయకుండా చేశాయి. ప్రభుత్వ పథకాల్లో అర్హులకు తప్పించి అనర్హులకు పెద్ద పీట వేయడంతో వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలతో పాటు మహిళలు, లబ్ధిదారులు, బాధితులు పెద్దఎత్తున రచ్చబండలో అధికార పార్టీ నాయకులను నిలదీశారు.
బొబ్బిలిలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం రచ్చబండను ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమవ్వాల్సిన కార్యక్రమం ఎంపీ ఝాన్సీ రాక ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. అప్పటికే భారీగా లబ్ధిదారులతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, తెలుగుదేశం, రైతు సంఘ నాయకులు సభాస్థలి వద్ద ఉన్నారు. ఎంపీ రాగానే సభలో తొలుత సమైక్య నినాదాలు మిన్నంటాయి. న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ చందాన సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాన్న రామకృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సమైక్య నినాదాలు చేస్తూ వేదికపైకి వెళ్లి ఎంపీకీ వినతిపత్రాన్ని అందించారు. దీనికి స్పందించిన ఎంపీ మాట్లాడుతూ తాను రాష్ట్ర సమైక్యతకే కట్టుబడి ఉన్నానన్నారు. తరువాత ఇటీవల బొబ్బిలిలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో అనర్హులకు స్థానం కల్పించి అర్హులను తొలగించడంతో వారంతా లిస్టులు పట్టుకుని వచ్చి ఎంపీ, అధికారపార్టీ నాయకులను చూస్తూ దూషించడం మొదలు పెట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తరువాత సభలో సీఎం సందేశాన్ని ఎంపీ చదువుతుండగా, వేదిక మీద రచ్చబండ కమిటీ అధికార సభ్యులు కాకుండా మిగిలిన వారిని ఖాళీ చేయించాలని, లేకపోతే మిగిలిన రాజకీయపార్టీలనూ వేదిక మీదకు ఆహ్వానించాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చెలికాని మురళీకృష్ణ, గంగుల మదన్ మోహన్, గునాన వెంకటరావు తదితరులు నినాదాలు చేశారు. దాంతో వేదిక మీద ఉన్న కమిటీ సభ్యుడు కాని రామభద్రపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములు నాయుడు కిందకు దిగిపోయారు. ఆ తరువాత స్థానిక నాయకుల ప్రోద్బలంతో వేదిక మీదకు శ్రీరాములునాయుడు మళ్లీ ఎక్కడంతో ప్రతిపక్షాల నినాదాలు మిన్నంటాయి. దీంతో రాజకీయం చేయడానికి వచ్చారా? అని అధికార పార్టీ నాయకులు ఎదురు దాడి చేస్తూ నినాదాలు చేసిన వారిని తోసుకుంటూ రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో అందోళనకారులను అదుపు చేయలేకపోయారు.
చవకబారు రాజకీయాలు వద్దు
ఈ ఆందోళనలు మరింత అధికం అవుతుండడంతో ఎంపీ ఝాన్సీ మాట్లాడుతూ ఈ బొబ్బిలికి ఎమ్మెల్యేగా ఉన్న వారు ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చిందనడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత ముందుకు తోసుకువచ్చారు. మీ పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు, స్వార్థాలకు బొబ్బిలి రాజులను విమర్శించడం తగదని, ఎంపీ స్థానంలో ఉండి చవకబారు రాజకీయాలను మానుకోవాలని నినాదాలు చేసి నేరుగా ఎంపీతోనే మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతున్నంత సేపు పట్టాల పంపిణీలో అర్హుల పేర్లు తొలగించిన లబ్ధిదారులు కాగితాలు చూపిస్తూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అలాగే రచ్చబండ కమిటీ సభ్యుడు,మాజీ విప్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతున్నంత సేపు కూడా నినాదాలు కొనసాగాయి.
అనర్హులకు రాత్రికి రాత్రే ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానం కల్పించి అర్హులను తొలగించారంటూ టీడీపీ నాయకులు పువ్వల శ్రీనివాస్, చోడిగంజి రమేష్‌నాయుడు, వెన్నెల వెంకటరమణ, తూమురోతు వెంకట్ తదితరులు ఎంపీని కలిసి ఫిర్యాదు చేశారు. సీపీఎం నాయకులు రెడ్డివేణు, పొట్నూరు శంకరరావులను వేదిక మీదకు రాకుండా పోలీసులు అడ్డుకున్నా రు. ఆందోళనకారులను సీఐ రఘుశ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని, అనర్హుల జాబితాను అధికారులకు అందిస్తే వాటిని తొలగిస్తామని ఎంపీ ఝాన్సీ ప్రకటించారు. ఇంటింటికీ వచ్చి అన్ని వార్డుల్లో అర్హులైన వారికి ఇళ్లు, పింఛన్లు అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చి సభ ను ముగించారు.
Advertisement
Advertisement