సీఎంకు సమైక్య కాక
Published Fri, Nov 1 2013 1:51 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి, రాజమండ్రి :ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమైక్య ఉద్యమ కాక తగిలింది. వర్ష బాధిత ప్రాంతాలను సందర్శించిన అనంతరం సీఎం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. సమావేశ మందిరం సమీపానికి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథరావుల ఆధ్వర్యంలో ఉద్యోగులు చేరుకు న్నారు. ప్రజాభిప్రాయానికి రాష్ట్ర విభజన వ్యతిరేకంగా జరుగుతోందంటూ నినాదాలు చేశారు. తమ నిరసనను సీఎం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని సమావేశం హాలులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
మరోపక్క జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం విరామమన్నది లేక కొనసాగుతూనే ఉంది. 93వ రోజైన గురువారం న్యాయవాదులు, జేఏసీ ప్రతినిధులు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. న్యాయవాదులు కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద రాస్తారోకో చేసి, సమైక్య నినాదాలు చేశారు. పోలీసులు 12మంది న్యాయవాదులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. రాజమండ్రిలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మెయిన్ రోడ్డులో ర్యాలీ చేశారు. పెద్దాపురంలో కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా న్యాయవాదుల శిబిరం వద్ద అఖిలపక్షం నేతలు రాస్తారోకో చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్‌లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. అంబాజీపేట సెంటర్‌లో ఉద్యోగులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేటలో భోజన విరామ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్ట్ర విభజనకు తమ నిరసన తెలిపారు. మెయిన్ రోడ్డుపైకి చేరి సమైక్య నినాదాలు చేశారు. ముమ్మిడివరంలో ఉద్యమం ప్రారంభమై 80 రోజులు పూర్తయిన సందర్భంగా 216 జాతీయ రహదారిపై తహశీల్దారు కార్యాలయం వద్ద 80 ఆకారంలో బైఠాయించి నిరసన తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. మధ్యాహ్నం జిల్లా బీసీ సెల్ కన్వీనర్ గుత్తుల రమణ, కో ఆర్డినేటర్ సీతాదేవి శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విషయమై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జగ్గంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షా శిబిరంలో గోకవరం మండల కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ సంఘీభావం తెలిపారు.
Advertisement