
పదవి నాకు లెక్కలోది కాదు: సీఎం కిరణ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య గళం వినిపించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సమైక్యం కోసం చేసే పోరాటంలో తన పదవిని సైతం లెక్క చేయనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతామన్నారు.
ఆ క్రమంలోనే నాగార్జున, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టగలిగామని కిరణ్ ఉదాహరించారు. విభజన నిర్ణయాన్నితనతోపాటు సీమాంధ్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతానికే మరింత నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఓ వేళ విభజిస్తే హైదరాబాద్ విషయాన్ని ఏం చేస్తారని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట విభజనను పునఃపరిశీలించాలని సీఎం కిరణ్ ఈ సందర్భంగా కేంద్రానికి సూచించారు.