కేంద్ర మంత్రి కావూరికి సమైక్య సెగ
Published Wed, Oct 30 2013 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM
కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : కొయ్యలగూడెం మండలంలో పర్యటనకు మంగళవారం వచ్చిన కేంద్ర జౌళి శాఖా మంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలిసి స్థానిక గణేష్ సెంటర్‌లో వందలాది మంది సమైక్యవాదులు గుమిగూడారు. ఐటీడీఏకు వెళుతున్న మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని ఆయనను కారులోంచి దిగాల్సిందిగా కోరారు. కారు దిగి నాయకులు చెప్పిన విషయాలను మంత్రి ఆలకించారు. సమైక్య రాష్ట్రంపై ఏమీ చెప్పకుండానే కారు ఎక్కడంతో సమైక్యవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. డీఎస్పీ రాఘవ, పోలీసు సిబ్బంది వారిని పక్కకు నెట్టేశారు. అనంతరం కాన్వాయ్ దిప్పకాయలపాడు చేరుకుంది.
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎస్‌ఆర్‌ఆర్ నరసింహరాజు, సమైక్య పరిరక్షణ ఉద్యమ యూత్ జేఏసీ సభ్యుడు గంగిరెడ్ల సతీష్, ఉపాధ్యాయుల సంఘాలు, ఎన్జీవో సంఘ నాయకుల ఆధ్వర్యంలో వందలాది మంది స్థానిక తూర్పు కాలువ బ్రిడ్జి వద్ద బైఠాయించి మంత్రిని అడ్డుకున్నారు. మంత్రి కారు దిగి ఉపాధ్యాయ సంఘం నాయకుని చేతిలో చెయ్యివేసి పార్లమెంట్‌లో సమైక్యరాష్ట్రానికి మద్దతుగా ఓటువేస్తానని ప్రమాణం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని మంత్రిని కోరారు. సహనం కోల్పోయిన మంత్రి మీకు చెప్పాల్సిన పని లేదనడంతో సమైక్యవాదులు ‘గోబ్యాక్ కావూరి’ అంటూ నినాదాలు చేశారు.
Advertisement
Advertisement