
కుక్క మాంసం తినొద్దన్నందుకు దాడి
యులిన్: కుక్క మాసం తినడం తగదని, అది మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ప్రచారం చేస్తోన్న జంతుప్రేమికులపై గుర్తుతెలియని అగంతకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. చైనాలోని యులిన్ పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రతిఏటా జూన్ 21, 22 తేదీల్లో 'యులిన్ ఫెస్టివల్' పేరుతో భారీ ఎత్తున కుక్క మాంసం విక్రయాలు జరుగుతుండటం తెలిసిందే. అయితే చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతుప్రేమికుల పోరాట ఫలితంగా ఈ ఏడాది కుక్క మాంసం పండుగ నిలిచిపోయింది.
అయినాసరే కొందరు వ్యాపారులు రహస్యంగా కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న జంతుప్రేమికుల బృందం.. ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యులిన్లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనకు దిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడిచేసి, నిరసనకారుల్ని చెల్లాచెదురు చేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారనే అక్కసుతో కుక్కల విక్రయదారులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని తెలిసింది. యులిన్ కుక్క మాంసం వేడుకల్లో భాగంగా ఏటా 10 వేల కుక్కలు బలవుతున్నాయి. ఇవన్నీ అక్రమ మార్గాల్లో తరలించిన శునకాలేనని జీవకారుణ్య సంస్థలు ఆరోపిస్తున్నాయి.