సాక్షి, అమరావతి: ప్రశ్నలు, సమాధానాలు, ‘కీ’లు తప్పుల తడకలు... సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు... అర్థంపర్థం లేని తెలుగు అనువాదాలు.. ప్రశ్నపత్రాల లీకేజీలు... మూల్యాంకనంలో లోపించిన సమతూకం... మెరిట్ అభ్యర్థులకు అన్యాయం.. లెక్కలేనన్ని కోర్టు కేసులు... గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వాకాలివీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వంటి సంస్థల సహకారంతో సమూల సంస్కరణల దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగులు వేస్తోంది. కమిషన్ బుధవారం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్ జింకా రంగ జనార్దన, సభ్యులు కె.విజయకుమార్, ప్రొఫెసర్ గుర్రం సుజాత, ప్రొఫెసర్ కె.పద్మరాజు, సేవారూప, ఎంవీ రామరాజు, జీవీ సుధాకర్‌రెడ్డి, ఎస్.సలాంబాబు, కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు, ప్రభుత్వ ఐటీ సలహాదారు లోకేశ్వరరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా, నియామకాల్లో అత్యుత్తమ విధానాలను అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి సూచనలు, అమలు చేయాల్సిన సంస్కరణలపై ఏపీపీఎస్సీ సభ్యులు చర్చించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అన్ని పోస్టులకూ ఇంటర్వూ్యలను రద్దు చేసి, మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అన్ని లోపాలను సవరించి, పూర్తి పారదర్శకంగా పనిచేసేలా ఏపీపీఎస్సీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఏపీపీఎస్సీలో అమలు చేయనున్న సంస్కరణలు
- ప్రశ్నలు, సమాధానాలు, ‘కీ’లలో పొరపాట్లకు తావులేకుండా వాటి రూపకల్పన సమయంలోనే నిపుణులతో పునఃసమీక్ష నిర్వహిస్తారు. తప్పులను ముందుగానే సవరించడమో, తొలగించడమో చేస్తారు.
- తెలుగు అనువాదంలో తప్పులు దొర్లకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూపీఎస్సీ, కేట్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు.
- గ్రూప్–1 పరీక్షలో డిజిటల్ మూల్యాంకనం అమలు చేస్తారు.
- మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను ట్యాబ్‌ల ద్వారా అందిస్తారు. ముందుగా అందించే పాస్‌వర్డ్‌తో పరీక్ష సమయానికి ఈ ట్యాబ్ తెరుచుకుని అభ్యర్థికి ప్రశ్నపత్రం దర్శనమిస్తుంది. సమాధానాలను బుక్‌లెట్‌లో రాయాలి.
- ఆ సమాధానాలను స్కాన్ చేయించి, కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు.
- ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో ఏయే పాయింట్లుండాలి? వాటికి ఎన్ని మార్కులు వేయాలి? అన్నది ముందుగానే నిపుణులు నిర్ధారిస్తారు.
- సమాధాన పత్రాలను తొలుత ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ఒకేసారి మూల్యాంకనం చేస్తారు. వారిచ్చే మార్కుల మధ్య వ్యత్యాసం 50 శాతం, అంతకు మించి ఉంటే మూడో నిపుణుడు మూల్యాంకనం చేస్తారు.
- ఆయా సమాధానాలకు వేసే మార్కులను ఏ కారణంతో అన్ని వేయాల్సి వచ్చిందో మూల్యాంకనం చేసిన నిపుణుడు తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు వీలుంటుంది.
- పరీక్షలు ప్రారంభమైన రెండో రోజు నుంచే మూల్యాంకనం చేపడతారు. గడువులోగా ఫలితాలు విడుదల చేస్తారు.
- మార్కుల తారుమారుకు అవకాశం లేకండా మూల్యాంకన సమయంలోనే అభ్యర్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో
నమోదు చేస్తారు.
- ప్రిలిమ్స్‌లోనూ ప్రశ్నలు, సమాధానాలను జంబ్లింగ్ చేసి, మాల్‌ప్రాక్టీసుకు అడ్డుకట్ట వేయనున్నారు.
- సిలబస్‌కు అనుగుణంగానే ప్రశ్నలుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రశ్నలు అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటాయి.
- ఎక్కడా లీకేజీకి ఆస్కారం లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తారు.
- గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటే మంచిదని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ప్రస్తుతం పేపర్–1 జనరల్ స్టడీస్, పేపర్–2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 మార్కుల చొప్పున నిర్వహిస్తున్నారు. జనరల్ ఆప్టిట్యూడ్‌లోని కొన్ని యూనిట్లను తీసుకొని ఒకే పేపర్‌గా చేయాలని యోచిస్తున్నారు. మ్యాథ్స్, ఆర్ట్స్ అభ్యర్థులకు సమన్యాయం జరిగేలా చర్యలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment