
సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రాఘవరెడ్డి గోశాల బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఎన్నికైన నాటా కార్యవర్గ సభ్యులతో నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమసాగర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కమిటీలో రాఘవరెడ్డితోపాటు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, బాలా ఇందుర్తి, ఆళ్ల రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డి, సోమ వరపు శ్రీనివాసులురెడ్డి, శివ మేక, గంగసాని రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి కొట్లూరు, రమణారెడ్డి క్రిస్టపాటి, కోటిరెడ్డి బుర్ల, శ్రీనివాస్‌రెడ్డి కానుగంటి, పెనుమాడ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
డాక్టర్ రాఘవరెడ్డి గోశాల ప్రస్థానం..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కొండమీది కొండూరు గ్రామంలో రైతు కుటుంబంలో రాఘవరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన ఉన్నత విద్యకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు. వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాటా ద్వారా అమెరికాలోని తెలుగువాళ్లకే కాకుండా ఏపీ, తెలంగాణల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాఘవరెడ్డి నాటా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన స్వగ్రామంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఏటా సొంత ఊరికి వచ్చి అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటారని, ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కాదనకుండా చేస్తారని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment