విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతోందని, అందుకే కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, ప్రత్యేక హోదాపై అనిశ్చితి నెలకొందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో ఆదివారం జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. త్వరలో డ్వాక్రా రుణాల మాఫీపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. మహిళల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వమూ ఎక్కువ రోజులు పాలన సాగించలేదనీ, ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి ఉసురు తగలడం మొదలైందని ఎద్దేవా చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశం చేయడంతో పాటు మహిళలు బ్యాంకుల ముఖం చూడలేని పరిస్థితి కల్పించిన ఘనత చంద్రబాబుదేనని రఘువీరా ద్వజమెత్తారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకో జూస్తున్నాయన్నాయనీ, దీంతో టీడీపీ, బీజేపీలను వేర్వేరుగా చూడలేకపోతున్నామని విమర్శించారు. 2002లో కేవలం కే బినెట్ నిర్ణయంతోనే ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించిన విషయాన్ని బీజేపీ మర్చిపోతే ఎలాగని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.