
మోనార్క్ చంద్రబాబు.. బీద అరుపులు
తనకన్నీ తెలుసునని, తాను మోనార్క్నని చెప్పి, ఎన్నికల్లో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీద అరుపులు అరుస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. చిన్న సమస్యను జటిలం చేస్తూ రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీల పాలనపై తాము డేగకన్ను పెడతామని రఘువీరారెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌లో కాంగ్రెస్ శ్రేణుల శిక్షణ తరగతులకు సోనియా, రాహుల్ హాజరవుతారని ఆయన తెలిపారు.