'రాజధాని ఎంపికలో బాబుది రహస్య ఏజెండా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికలో చంద్రబాబు సర్కార్కు రహస్య ఏజెండా ఉన్నట్లుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అందుకే తనవారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజధానిపై బాబు కమిటీ వేశారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో రఘువీరా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై రఘువీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఎంపిక ఏకాభిప్రాయంతోనే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రజలముందు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.
ఎంసెట్ అడ్మిషన్లలో రాజకీయ లాభాపేక్ష సరికాదని సుప్రీంకోర్టు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆక్షేపించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకుని సమస్యలు పరిష్కరించాలని రఘువీరా ఇరు రాష్ట్రాల సీఎంలను కోరారు. ఇరు రాష్ట్రలలో సమస్యల పరిష్కారానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.
విభజన చట్టం ప్రకారం అడ్మిషన్లలో స్థానికత అంశం తలెత్తదన్నారు. పీజు రీయింబర్స్మెంట్ పథకం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా అయితే 35 వేల మంది విద్యార్థుల ఫీజు భారాన్ని చంద్రబాబు ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని కాలేజీ విద్యార్థుల ఫీజు కూడా చెల్లించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు రఘువీరా సూచించారు.