నేరం వారిదే..తప్పు అందరిదీ..!
సాక్షి, గుంటూరు : కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో సుహృద్భావ వాతావరణానికి దారితీయాల్సిన పరిచయ కార్యక్రమాలు వికృత రూపం దాలుస్తున్నాయి. తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన సీనియర్లు అందుకు భిన్నంగా ర్యాగింగ్ కు పాల్పడడం విద్యార్థి జీవితానికి ముగింపు పలుకుతోంది. ర్యాగింగ్‌కు గురైన వారు ఆత్మహత్యలకు పాల్పడి తమ జీవితాలను అర్ధంతరంగా ముగించుకుంటుంటే, ర్యాగింగ్‌కు పాల్పడినవారు జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందించటంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైన శ్రద్ధ చూపకపోవడం ఒకటైతే, ర్యాగింగ్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన లేకపోవటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కళాశాలలు విద్యా ప్రమాణాలను పాటించకపోవటం కూడా ఇలాంటి అనర్థాలకు అవకాశం ఇస్తున్నాయి.
జూనియర్లకు బాసటగా నిలవాలన్నదే లక్ష్యం:
యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరే జూనియర్ విద్యార్థుల్లో ఉండే భయాలను పోగొట్టి ఆ విద్యా సంస్థలోని వాతావరణాన్ని అలవాటు చేయటం, విద్యాపరమైన అనుమానాలుంటే వాటిని తీర్చడం. ఇంటి బెంగతో, ఒంటరితనంతో బాధపడుతుంటే మేమున్నామంటూ భరోసా కల్పించటం, భవిష్యత్ పట్ల సరైన అవగాహనం కల్పించటం, కుల, మతాలకు దూరంగా ఉండే విధంగా సీనియర్లు దిశానిర్ధేశం చేయాలి. అయితే దీనికి భిన్నంగా జరగడం విచారకరం.
అలంకారప్రాయంగా మారిన యాంటీర్యాగింగ్ కమిటీలు :
ర్యాగింగ్‌ను తీవ్రమైన విషయంగా పరిగణించాల్సిన కళాశాలల యాజమాన్యాలు పట్టీపట్టనట్లు వ్య వహరిస్తున్నాయి. ప్రతి విద్యాసంస్థలో యాంటీర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. మొదట్లో జూనియర్లు, సీనియర్లు కలవకుండా కళాశాల వేళల్లో మార్పు చేయటం, వసతి గృహాల్లో వేర్వేరుగా వసతి కల్పించటం, అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉండేలా చూడటం, ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరి ణామాలు, శిక్షలను తెలియజేయటం, తల్లిదండ్రులతో సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించటం వంటివి చేయాలి. అయితే అనేక విద్యాలయాల్లో యాంటీర్యాగింగ్ క మిటీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ర్యాగింగ్‌కు పాల్పడితే పడే శిక్షలు:
ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ వ్యతిరేక చట్టం (1997) ప్రకారం ర్యాగింగ్ చేసేవారికి, ప్రోత్సహించేవారికి అనేక శిక్షలు అమల్లో ఉన్నాయి. విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే ఆరు నెలలు జైలు శిక్ష, శారీరక హింస, నేరపూరిత చర్యలకు పాల్పడితే ఏడాది జైలు, ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధిస్తే రెండేళ్ల జైలు , మాన మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు, బలవంతంగా ఎత్తుకుపోవటం, దాచిపెట్టటం, మాన భంగం, అసహజమైన మనస్థాపం కలిగించటం వంటివి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, మరణానికి కారణ భూతులైతే పది సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇవి కాకుండా విద్యాలయం నుంచి శాశ్వతంగా తొలగించటం, ఇకపై ఏ విద్యాలయంలోనూ ప్రవేశం లేకుండా అనర్హత వేటు వేస్తారు.
ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్లే అనర్థాలు
ఉమ్మడి కుటుంబాలు ఉంటే కలిసి మెలిసి ఉండటం, అమ్మమ్మ, తాతయ్య చెప్పే మంచి బుద్ధులు నేర్చుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళుతుంటే పిల్లలకు మంచి చెప్పే వారే కరువయ్యారు. ఆలోచించే ఓపిక లేక తాము అనుకుంది జరగకపోతే చావడమో, చంపడమో వంటివి చేస్తున్నారు.
- డాక్టర్ ఉమా జ్యోతి, మానసిక వైద్యురాలు
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ..
ర్యాగింగ్ నిర్మూలనకు కమిటీలు, చట్టాలు తెస్తే ఉపయోగం లేదు. వాటి అమలు, పర్యవేక్షణలో అధికారులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలి. విద్యా సంస్థల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాల వల్ల ర్యాగింగ్ నిరోధానికి ఉపయోగం ఏమీ ఉండదు. ర్యాగింగ్ జరిగిన తరువాత ఎవరు చేశారనేది గుర్తించడానికి మాత్రమే సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ర్యాగింగ్ జరిగిన విద్యాసంస్థలో ర్యాగింగ్ చేసిన వారితోపాటు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు, అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి.
- మొండి మురళీకృష్ణ, రిషితేశ్వరి తండ్రి.