
కరుణించు ప్రభూ
నిన్న యూపీఏ.. నేడు ఎన్‌డీఏ.. పాలకులు ఎవరైనా జిల్లా రైల్వే ప్రగతిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు.
రాజంపేట: నిన్న యూపీఏ.. నేడు ఎన్‌డీఏ.. పాలకులు ఎవరైనా జిల్లా రైల్వే ప్రగతిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో పనులు నొస్సం వరకు పూర్తి కాగా, కడప- బెంగళూరు పనులు పెండ్లిమర్రి వరకు పూర్తయ్యాయి. ఇక కృష్ణపట్నం- ఓబులవారిపల్లె మార్గంలో ఎర్త్ పనులు పూర్తికాగా, టన్నెల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులకు అరకొర నిధులు కేటాయిస్తుండటంతో దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఇక కొత్త రైళ్లపై జిల్లా వాసులు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ముంబయి-చెన్నై కారిడార్ మార్గం జిల్లా మీదుగా ఉండటంతో బైవీక్లీ ైరైళ్లు నడుస్తున్నాయి. జిల్లాలో రైల్వేపరంగా బ్రిటీష్ కాలం నుంచి వైభవంగా వెలుగొందిన నందలూరు రైల్వే పరిశ్రమపై నాటి యూపీఏ..నేటి ఎన్‌డీఏ పాలకులు శీతకన్ను వేశారన్నది వాస్తవం.
ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానికి జిల్లా నుంచి ఒక్కటంటే ఒక రైలుమార్గం కూడా అందుబాటులో లేదు. కొత్త రైల్వేలైన్లు సర్వేలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌తోపాటు డబుల్‌డెక్కర్ రైలు స్టాపింగ్స్ గురించి ఎప్పటి నుంచో కోరుతున్నా రైల్వే మంత్రిత్వశాఖ ఖాతరు చేయడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వే అభివృద్ధి విషయంలో జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. ఈనెల 26న పార్లమెంటులో రైల్వేమంత్రి సురేష్‌ప్రభు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వం ఈసారైనా కరుణ చూపేనా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొత్త రైళ్లపై కోటి ఆశలు..
జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్ల మాట అటుంచితే.. కనీసం పొడిగింపు రైళ్లకు కూడా మోక్షం కలగలేదు. జిల్లా మీదుగా షిర్డికి వెళ్లేందుకు గతంలో ఏర్పాటు చేసిన రైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో గుంతకల్లు నుంచి ధర్మవరం, పాకాల మీదుగా తిరుపతికి మళ్లించేలా చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లా మీదుగా షిర్డీ వెళ్లేందుకు ఒక్కరైలు కూడా వేయలేని దుస్థితి నెలకొంది. అలాగే మచిలీపట్నం-తిరుపతి రైలును కడప వరకు పొడిగిస్తే తాత్కాలికంగా రాజధానికి వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.ఎర్రగుంట్ల- నంద్యాల రైలు మార్గంలో నందలూరు నుంచి నొస్సం వరకు రైలు నడిపించాలనే ప్రయత్నాలు ఎప్పుడు అమలవుతాయో అర్థం కావడం లేదు. పగటి పూట కర్నూలు- హైదరాబాద్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. చెన్నై నుంచి డీజిల్ మల్టిపుల్ యూనిట్ (డీఎంయూ) రైళ్లను కడప వరకు నడిపిస్తే ఆదాయం బాగుంటుందని రైల్వే కమర్షియల్ అధికారులు సూచిస్తున్నా పట్టించుకునే వారు లేరు. జిల్లాలో గ్రామీణులకు అందుబాటులో గుంతకల్లు నుంచి కడప వరకు, కడప నుంచి రేణిగుంట వరకు మరో ప్యాసింజర్ రైలును కోరుతున్నప్పటికి బోగీల కొరత ఉందంటూ కాలయాపన చేస్తున్నారు.
కొత్త రైల్వే లైన్లు సర్వేలకే పరిమితం..
2010-2011 రైల్వే బడ్జెట్‌లో కూడా కొత్త రైల్వే లైన్‌గా కంభం-ప్రొద్దుటూరును ప్రకటించారు. రైల్వేలైన్ 142 కిలోమీటర్ల మేర ఉండే విధంగా రూట్‌ను ఖరారు చేశారు. దాదాపు రూ.829 కోట్ల వ్యయాన్ని ఈ రైల్వేలైన్‌కు అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రణాళిక సంఘం ఈ లైనుకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
యూపీఏ, ఎన్‌డీఏ సర్కారు బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన గిద్దలూరు- భాకరాపేట, కంభం -ప్రొద్దుటూరు రైల్వే లైన్లు గిద్దలూరులో ఉన్న రైలు మార్గానికి కలిపే విధంగా సర్వేలు చేపట్టిన విషయం విదితమే. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు, బద్వేలు మీదుగా గిద్దలూరు లైనుకు కలిపే విధంగా మార్గానికి రూపకల్పన చేసినట్లు రైల్వే వర్గాల సమాచారం.
గత బడ్జెట్‌లో కేటాయింపు ఇలా..
తాజాగా ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక తొలిసారి అప్పటి రైల్వేమంత్రి సదాశివనందగౌడ్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసులకు ఆశాజనకంగా లేదు. కంభం-ప్రొద్దుటూరు లైనుకు రూ. 10లక్షలు, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ.208కోట్లు, కడప-బెంగళూరు రైల్వేలైన్‌కు రూ. 30కోట్లు కేటాయించారు.
పెండ్లిమర్రి వరకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ రైల్వేలైను అందుబాటులోకి రావాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందోననే చర్చ జరుగుతోంది. అలాగే నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వేలైన్‌కు రూ.80కోట్లు కేటాయించారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైలును పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిపిస్తారోనని ఆ రెండు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ైరె ల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా జిల్లాకు మేలు జరుగుతుందో లేదో వేచి చూద్దాం.