![Indian Railways which were Built by British Rule](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Indian-Railways.jpg.webp?itok=h6s4_OzP)
నిజాం కాలంనాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలో కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. దేశంలోని పలు రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వే స్టేషన్ల పురాతన కట్టడాలను కూల్చివేసి, నూతన నిర్మాణాలను చేపడుతోంది. భారతీయ రైల్వే ప్రస్తుతం ఏడు వేలకుమించిన రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. వీటి మీదుగా 13 వేలకు మించిన ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. భారతదేశంలో రైల్వే వ్యవస్థ బ్రిటిష్ పాలనలో ప్రారంభమయ్యింది. ఆ సమయంలో పలు స్టేషన్లను నిర్మించారు. వాటిలోని కొని స్టేషన్లు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఆయా రైల్వే స్టేషన్లు ఎక్కడున్నాయనే విషయంలోనికి వెళితే..
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/13_30.jpg)
హౌరా రైల్వే స్టేషన్
ఇది పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గల ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి మొదటి రైలు 1854 ఆగస్టు 15న నడిచింది. ఇది హౌరా-హుబ్లీ లైన్‌లో ఉంది. ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం 23 ప్లాట్‌ఫారాలున్నాయి. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌గా హౌరా పేరుగాంచింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/14_31.jpg)
రాయపురం రైల్వే స్టేషన్
చెన్నై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లోని వాలాజాపేట విభాగంలో ఉన్న రాయపురం రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ పాలకులు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో ఇక్కడి నుంచి మొదటి రైలు 1856లో ఇక్కడి నుంచి నడిచింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/15_17.jpg)
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్‌ను గతంలో మొఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. తరువాత పేరు మార్చారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్. వారణాసికి నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ 1862లో నిర్మితమయ్యింది.
ఛత్రపతి శివాజీ టెర్మినస్
ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతదేశంలోని ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. దీని నిర్మాణం 1878లో ప్రారంభమై, 1887లో పూర్తయింది దీనికి తొలుత క్వీన్ విక్టోరియా అనే పేరు పెట్టారు. 1996లో ఛత్రపతి శివాజీగా మార్చారు.
డెహ్రాడూన్ రైల్వే స్టేషన్
డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ రైల్వే స్టేషన్. దీనిని 1897-1899 మధ్య బ్రిటిష్ వారు నిర్మించారు. ఈ రైల్వే లైన్‌కు 1896లోనే ఆమోదం లభించినా, నిర్మాణ పనులు 1900లో ప్రారంభమయ్యాయి.
లక్నో చార్‌బాగ్ రైల్వే స్టేషన్
లక్నోలోని ఐదు రైల్వే స్టేషన్లలో చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ప్రముఖమైనది. దీని నిర్మాణం 1914లో మొదలై, 1923 లో పూర్తయ్యింది. అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చయింది. స్టేషన్ ముందు భాగంలో ఒక పెద్ద పార్కు ఉంది. ఈ స్టేషన్ రాజ్‌పుత్, అవధి, మొఘల్ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
అజ్మేరీ గేట్ - పహార్‌గంజ్ మధ్య ఉన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమోదించింది. 1931లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యింది. ఈ స్టేషన్‌లో 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. వందలాది రైళ్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
Comments
Please login to add a commentAdd a comment