బాపట్ల రైల్వేస్టేషన్ మెడల్ స్టేషన్‌గా చెబుతున్నప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఈ స్టేషన్ ఆదాయంలో మెండుగా ఉన్నప్పటికీ సౌకర్యాలు కల్పనలో నామమాత్రంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితయ్యాయి.
అభివృద్ధికి..రెడ్‌సిగ్నల్
Published Wed, Feb 12 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
మో‘డల్’ రైల్వేస్టేషన్
బాపట్ల, న్యూస్‌లైన్ : బాపట్ల రైల్వేస్టేషన్ మెడల్ స్టేషన్‌గా చెబుతున్నప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఈ స్టేషన్ ఆదాయంలో మెండుగా ఉన్నప్పటికీ సౌకర్యాలు కల్పనలో నామమాత్రంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితయ్యాయి.
బాపట్ల- నిజాంపట్నం- రేపల్లె మధ్యలో కొత్త రైల్వే లైను ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి మూడేళ్లయినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
స్టేషన్‌లో మొదటి ప్లాట్‌ఫాం నుంచి రెండో ప్లాట్‌ఫాంకు వెళ్లే బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని ఎన్నిసార్లు ప్రతిపాదించిన ఫలితంలేదు. వృద్ధులకు లిఫ్టు సౌకర్యాం ఏర్పాటు చేస్తామని చెప్పి పట్టించుకోలేదు.
విజయవాడ వైపు వెళ్లే లైనుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ప్లాట్‌ఫాం లేకపోవటంతో అప్పికట్ల వె ళ్లి అక్కడ క్రాసింగ్ ఇవ్వాల్సివస్తుంది.
ధాన్యం పండించే ప్రాంతం కావటంతో ధాన్యాన్ని లోడింగ్ చేసేందుకు ప్రత్యేక ప్లాట్ ఫాం నిర్మించాలని ఎన్నోసార్లు ప్రతిపాదించినప్పటి కీ ఫలితం లేదు.
మొదటి ఫాంలో రిజర్వేషన్ బోగీలు సూచించే బోర్డులు లేవు.
రైలుపేట, ఉప్పరపాలెం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం నిర్మించిన బ్రిడ్జి వద్ద దిగేందుకు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్టూవర్టుపురం రైల్వేస్టేషన్ వద్ద ప్లాట్‌ఫాంలు నిర్మించాలని ప్రయాణికులు ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది.
ఆదాయం ఘనం.. అభివృద్ధి శూన్యం
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ : విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ప్రధాన రైల్వే జంక్షన్లలో తెనాలి ఒకటి. దక్షిణమధ్య రైల్వే డివిజనులో విజయవాడ తర్వాత ప్రాముఖ్యత కలిగినది తెనాలి జంక్షన్. విజయవాడ, చెన్నై, గుంటూరు, రేపల్లె మార్గాలనుంచి రోజూ 83 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. వీటిలో 63 ఎక్స్‌ప్రెస్, 20 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ప్రయాణికుల టికెట్లు, పార్సిల్ కార్యాలయం, మొక్కజొన్న ఎగుమతుల ద్వారా రైల్వేస్టేషను ఆదాయం ఏడాదికి రూ.18 కోట్లపై మాటే. అయినా సౌకర్యాలు పెరగకపోవడంపై ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతూనే ఉంది.
తెనాలి-రేపల్లె రైలుమార్గం ఆధునికీకరణ దశాబ్దాల తరబడి నలుగుతోంది. పల్నాడు ఎక్స్‌ప్రెస్ తెనాలికి పొడిగింపు, హైదరాబాద్‌కు నేరుగా తెనాలి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు, కేరళ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ డిమాండ్లు ఆచరణకు నోచుకోలేదు.
ఫస్ట్ ప్లాట్‌ఫాంపైన అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ నిర్మాణం, రెండో రిజర్వేషన్ కౌంటరు ఏర్పాటు వంటి ప్రయాణికుల కోర్కెలు నెరవేరడం లేదు.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రెండు వైపుల్నుంచి తెనాలికి చేరేసరికి కిక్కిరిసివుంటోంది. దూరం నుంచి వస్తున్నందున ఆలస్యం అనివార్యమవుతోంది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం-తెనాలి, తెనాలి-సికింద్రాబాద్‌గా విభజించి నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పల్నాడు ఎక్స్‌ప్రెస్.. తెనాలి ప్రాంతవాసులకుఅందని ద్రాక్షగానే మిగిలింది. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు.. 2009 ఎన్నికల ప్రచార సమయంలో రైలును పొడిగిస్తామని హామీనిచ్చినా, ఇప్పటికీ నెరవేరలేదు. సూపర్‌ఫాస్ట్ కేరళ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్-కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్‌లకు తెనాలిలో స్టాపింగ్ కల్పించాలని ప్రయాణికులు ఎంతో కాలంగా కోరుతున్నారు.
గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గత బడ్జెట్‌లో దీని కోసం రూ.28.60 కోట్లను కేటాయించారు. పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. అయినా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
అన్నీ సమస్యలే..
నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్: ఆదర్శ రైల్వేస్టేషన్‌గా చెబుతున్న నరసరావుపేట రైల్వేస్టేషన్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. పట్టణంలోని శృంగేరిశంకరమఠం వద్ద రెండోగేటు వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. ఈ గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) నిర్మాణం చేపడతామంటూ అనేక ఏళ్లుగా చెబుతున్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు రైలు మార్గం ద్వారా హైదరాబాదు వెళ్లాలంటే పిడుగురాళ్ళ, సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌కు వె ళ్లి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. పిడుగురాళ్ళ నుంచి నరసరావుపేటకు రైల్వేమార్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎంపీలు చెబుతూ వస్తున్నారే గానీ అమలు చేయడంలేదు.
గతంలో నరసరావుపేట నుంచి గుంటూరు, తెనాలి, విజయవాడకు షెడ్యూల్ రైలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆ దశగా ప్రయత్నాలు జరగలేదు.
రైల్వేస్టేషన్‌లో సమస్యలు తిష్ట వేసుకున్నాయి. రెండో ప్లాట్‌ఫాం వద్ద ఏర్పాటు చేసిన కుళాయిల్లో మంచినీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాష్‌నగర్ వైపు నివశించే ప్రజలకు స్టేషన్‌కు వెళ్లే మార్గంలేకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది.
సౌకర్యాలు శూన్యం..
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ : ఆదాయం ఘనం... సౌకర్యాలు శూన్యం అన్నచందంగా ఉంది పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ పరిస్థితి. రోజుకు లక్ష రూపాయల ఆదాయం వస్తున్న ఈ స్టేషన్‌ను సౌకర్యాల లేమి వేధిస్తోంది. ఇక్కడి ప్రధాన సమస్యలివీ..
కాకినాడ-ముంబై, ముంబై-కాకినాడ లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు ఇక్కడ హాల్ట్‌లేదు. అలాగే కాకినాడ-భావనగర్, భావనగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌కు కూడా హాల్ట్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రెండు ప్లాట్‌ఫాంలున్న పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌కు వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకు లేకపోవటంతో నీటిసమస్య తీవ్రంగా ఉంది. కేవలం ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై కొంతమేరమాత్రమే నీటిసౌకర్యం ఉంది. రెండుప్లాట్‌ఫాంలకు వాటర్‌పైపులైను వేసినప్పటికీ ఓవర్‌హెడ్‌ట్యాంకు లేకపోవటంతో అవి నిరుపయోగంగా మారాయి.
స్టేషన్‌కు ప్రహరీగోడ లేకపోవటంతో రాత్రివేళలో చోరీలు జరుగుతున్నాయి.
బెంచీలు, కుర్చీలు స్వల్పంగా మాత్రమే ఉండటంతో ప్రయాణికులు ఎంతసమయమైనా నిలబడే వేచిచూడాల్సి వస్తుంది. ఫస్ట్‌క్లాస్ వెయిటింగ్‌హాలులోనూ ఇదే పరిస్థితి
ఏ నంబరు బోగీ ఎక్కడ ఆగుతుందో సూచించే బోర్డులు లేకపోవటంతో ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
స్లీపర్‌క్లాస్ ప్రయాణికులకు ఒక చిన్న వెయిటింగ్ హాలుమాత్రమే ఉంది. మరో వెయిటింగ్ హాలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది.
పిడుగురాళ్ల-కాచిగూడ పుష్‌పుల్ రైలును మధ్య ప్లాట్‌ఫాంపై నిలుపుతుండటంతో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
రాత్రివేళలో ప్రత్యేకంగా బుకింగ్ క్లర్క్ లేకపోవటంతో అన్నిపనులు స్టేషన్‌మాస్టరే చూసుకోవాల్సి వస్తోంది.
Advertisement
Advertisement