జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇస్తుందనుకున్న రైల్వే వ్యాగన్ వర్‌కషాపు నిర్మాణం.. ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతోంది.
సాక్షి, హన్మకొండ
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇస్తుందనుకున్న రైల్వే వ్యాగన్ వర్‌కషాపు నిర్మాణం.. ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతోంది. ఇదిగో పనులు.. అదిగో ప్రారంభం.. అంటూ మంత్రులు, ప్రజాప్రతినిధులు నాలుగేళ్లుగా మాటలు చెబుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజురయ్యేలా కృషి చేయడం లేదు. ప్రాజెక్టు ప్రారంభానికి కీలకమైన భూకేటాయింపు ఫైల్ సీఎం కార్యాలయంలో నెలల తరబడి మూలుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు 2014-15 రైల్వే బడ్జెట్ కసరత్తు నవంబర్ నుంచి మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా నిధుల మంజూరుకై ప్రజాప్రతినిధులు శ్రమించాల్సిన అవసరం ఉంది.
భూమిని ఎంపిక చేసినా..
2010-11లో కాజీపేటకు పబ్లిక్, ప్రైవే టు భాగస్వామ్యం పద్ధతిలో వ్యాగన్ వర్కుషాపును రైల్వేశాఖ మంజూరు చేసింది. వర్కుషాపు నిర్మాణానికి కాజీ పేట సమీపంలోని అయోధ్యపురంలో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయూనికి చెందిన 53 ఎకరాల భూ మి అనువైనదిగా ఎంపిక చేశారు. అయి తే ఈ భూమిని దేవాదాయ శాఖ నుంచి రాష్ట్ర రవాణాశాఖకు బదాలాయించేందు కు కోర్టు అనుమతి తీసుకోవడానికి రెం డేళ్లకు పైగా సమయం పట్టింది. ఆ తర్వా త 2013 ఫిబ్రవరిలో భూ సేకరణకు అవసరమైన *6 కోట్లు విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గడిచిన ఆర్నెళ్లుగా ఈ ఫైలు సీఎం కార్యాలయంలో పెండింగ్‌లోనే ఉంది. ఈ నిధులు విడుదలైతే దేవాదాయ శాఖకు నష్టపరిహారంగా చెల్లించి.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునే వీలు ఏర్పడుతుంది. ఆ తర్వాత సదరు భూమిని రైల్వేశాఖకు అప్పగించాలి. అప్పుడు రైల్వేశాఖ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలు ఆహ్వానించడంతో పాటు తన శాఖ తరఫున నిధులు కేటాయిస్తుంది. సాధరణంగా నవంబర్ నుంచి కొత్త బడ్జెట్ కసరత్తు ప్రారంభం కానుంది. కాబట్టి.. సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా భూమిని సేకరించి రైల్వేశాఖకు అప్పగిస్తే అందుకు అనుగుణంగా రైల్వేశాఖ నిధు లు కేటాయించే అవకాశం ఉంది. లేనిపక్షం లో మరోసారి మొండిచేయి తప్పకపోవచ్చు.
ఆలస్యమైతే అసలుకే ఎసరు..
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వరంగల్ జిల్లా కాజీపేటతో పాటు రైల్వేశాఖ సహా య మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సొంత జిల్లా అయిన కర్నూలుకు సైతం రైల్వేశాఖ పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో వ్యాగన్ వర్కుషాపు మంజూరు చేసింది. నాలుగేళ్లుగా కాజీపేట నిర్మాణం మాటలకే పరిమితం అవుతుండగా.. గత బడ్జెట్‌లో మంజూరైన కర్నూలులో వ్యాగన్ పరిశ్రమ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యా యి. ఒకే జోన్‌లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రైల్వేశాఖ చేపడుతున్న రెండు ప్రా జెక్టుల్లో కాజీపేట పరిశ్రమ విషయంలో ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడంలో నిర్లక్ష్యం చూపిస్తుంది. దీనికి తోడు రైల్వేమంత్రి సొంత జిల్లాను కాదని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారనేది ప్రశ్నార్థకమే.
మళ్లీ ప్రజా ఉద్యమం చేయాలా?
గతంలో కాజీపేటకు మంజూరైన వ్యాగన్ వర్క్‌షాపును మనోహరాబాద్, సికింద్రాబాద్‌లకు తరలించేందుకు గతంలో తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇందుకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా ఉద్యమాల కారణంగానే ‘కాజీపేటలోనే వ్యాగన్ పరిశ్రమ నిర్మాణం’ అనే ఆశలు నేటికీ సజీవంగా ఉన్నాయి. కానీ ఈ పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన భూమిని సకాలంలో కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ఇప్పటికైనా నిధులను విడుదల చేయించేందుకు సీఎంపై యుద్ధప్రతిపాదికన ఒత్తిడి తీసుకురావాల్సింది ఉంది. అప్పుడే వ్యాగన్ పరిశ్రమ కల నేరవేరుతుంది. లేని పక్షంలో రైల్‌కోచ్‌ఫ్యాక్టరీ కపుర్తాలకు వెళ్లినట్లే.. వ్యాగన్ పరిశ్రమ కర్నూలుకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాగన్ ఫ్యాక్టరీ భూమికి నిధులు అందలేదు
నిబంధనల ప్రకారం దేవాలయ భూములను అమ్మడం లేదా కొనడానికి హైకోర్టు అనుమతి తప్పనిసరి. అయితే శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం సంబ్బందించిన 53 ఎకరాల భూమిని వ్యాగన్ పరిశ్రమకు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ భూమికి పరిహారం చెల్లిస్తే సరిపోతుంది. కానీ, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి అవసరమైన భూమని సేకరించేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందలేదు.
- సులోచన, సీతారామాంజనేయ స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి