రెయిన్‌ గన్‌..ఓ విఫల ప్రయోగం | Rain Gun is a Failure Experiment | Sakshi
Sakshi News home page

రెయిన్‌ గన్‌..ఓ విఫల ప్రయోగం

Published Thu, Jan 3 2019 4:58 AM | Last Updated on Thu, Jan 3 2019 4:58 AM

Rain Gun is a Failure Experiment - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిన రెయిన్‌ గన్స్‌ ఇపుడు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రాన్ని కరువు కుదిపేస్తున్న తరుణంలో రెయిన్‌గన్స్‌ౖ గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసిన రెయిన్‌ గన్‌లు ప్రస్తుతం ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో, వాటిని ఎవరైనా వాడుతున్నారో లేదో ఎవరికీ తెలియడం లేదు. రూ.వందల కోట్ల ప్రజాధనం కుమ్మరించి, కొనుగోలు చేసిన రెయిన్‌గన్స్‌ ఆచూకీ లేకుండాపోయాయి. రెండేళ్ల క్రితం రెయిన్‌ గన్‌ల గురించి భారీగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటి ఊసెత్తడం మానేసింది. వర్షాధార పంటలకు మాత్రమే ఉపయోగపడే రెయిన్‌ గన్‌లతో అన్ని పంటలనూ కాపాడుకోవచ్చని ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే, అవి రైతులకు ఉపయోగపడిన దాఖలా లు లేవు. గతంలో ఒక్కొక్క మండలానికి 3 నుంచి 10 వరకు రెయిన్‌ గన్స్‌ను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ శాఖ అధికారులు 15 కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేశారు. వాస్తవానికి నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వర్షాధార పంటలకు ఒకటి లేదా రెండు తడులు ఇవ్వడానికి మాత్రమే రెయిన్‌ గన్‌లను డిజైన్‌ చేశారు. పొలాలకు సమీపంలోని నీటి గుంతలు, చెరువులు, కాలువలు, ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి, రెయిన్‌ గన్‌ల సాయంతో సగటున ఎకరం పొలం తడిసేలా ఏర్పాటు చేయవచ్చు. అయితే వర్షాధార పంటలకు మాత్రమే ఇవి పనికొస్తాయి. 

ఒక్కో యూనిట్‌ ధర రూ.50 వేల పైమాటే 
కరువు బారినపడ్డ పంటలను రక్షిస్తామంటూ.. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టి రూ.163 కోట్లు ఖర్చు పెట్టి 13,334 రెయిన్‌ గన్‌లు, స్ప్రింకర్లు, 7,970 ఆయిల్‌ ఇంజిన్లు, 3.50 లక్షల నీటి పైపులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం మరో రూ.103 కోట్లు ఖర్చు పెట్టింది. రెయిన్‌గన్‌ల కొనుగోలు వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు అప్పట్లో శాసనసభలో దుమారం చెలరేగింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన 13,334 రెయిన్‌గన్‌లు ప్రస్తుతం ఎక్కడున్నాయో తెలియదు. అవి ఇప్పుడు ఎక్కడా పంటల పొలాల్లో పెద్దగా కనిపించడం లేదు. వాస్తవానికి రెండేళ్లుగా ప్రభుత్వంతో సహా రైతులు కూడా రెయిన్‌ గన్‌లను పూర్తిగా మరిచిపోయారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో వ్యవసాయశాఖ గోదాములకే రెయిన్‌ గన్‌ కిట్లు పరిమితమయ్యాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఇవి ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో వీటిని అసలు వినియోగించలేదు. రెయిన్‌ గన్‌ కిట్‌లో రూ.6 వేల ఖరీదు చేసే రెయిన్‌ గన్, రూ.24 వేల ఖరీదైన ఆయిల్‌ ఇంజిన్, రూ.14 వేల విలువైన 20 పైపులు, రూ.7 వేల విలువ చేసే స్ప్రింక్లర్ల సెట్‌ ఉంటాయి. ఒక యూనిట్‌ ఖరీదు రూ.50 వేలకు పైగానే ఉంటుంది. 

టీడీపీ నేతల ఇళ్లల్లో రెయిన్‌గన్‌లు 
ఉద్యాన వన, సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన 13,334 రెయిన్‌ గన్‌లు అడ్రస్‌ లేకుండా పోయాయి. అప్పట్లో రెయిన్‌ గన్‌లు కొన్న తర్వాత 2016 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలోనే మకాం వేసి 4 రోజుల్లో 4 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడామని ప్రకటించారు. చంద్రబాబు రెయిన్‌ గన్‌ను ప్రారంభించిన పొలంలోనే పంట ఎండిపోయింది. ఇప్పుడా రెయిన్‌ గన్‌లు, వీటికి ఉపకరణాలైన ఆయిల్‌ ఇంజిన్లు, స్ప్రింక్లర్లు, పైపులు, ఇతరత్రా సామగ్రిలో మూడొంతులు అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు చేరాయి. ఈ రెయిన్‌ గన్స్‌లో దాదాపు సగం అంటే 6,426 గన్లను, 4306 ఆయిల్‌ ఇంజన్లను, 5,894 స్ప్రింకర్లు, 4.11 లక్షల పైపులను అనంతపురం జిల్లాకు ఇచ్చామని అధికారిక లెక్కలు చూపినా వీటిల్లో 60 శాతం ఎక్కడున్నాయో తెలియడం లేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు ఏం చేయాలో తెలియక వ్యవసాయ అధికారులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే రెయిన్‌ గన్‌లతో 2018లో కూడా వేలాది ఎకరాల్లో పంటలను కాపాడానని  సీఎం ఇటీవల శ్వేతపత్రంలో పేర్కొనడం గమనార్హం. 

రెయిన్‌గన్‌ అంటే?
బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే రెయిన్‌గన్‌. పంటను బట్టి రెయిన్‌ గన్‌ స్టాండ్లను ఏర్పాటు చేస్తారు. జొన్న, సజ్జ, చెరకు వంటి వాటికైతే ఐదారు అడుగులు, మిర్చి, పత్తి తదితర పంటలకు రెండు మూడు అడుగుల ఎత్తులో స్టాండ్లను అమర్చుతారు. సామర్థ్యాన్ని బట్టి కొన్ని రెయిన్‌గన్లు సుమారు 45 మీటర్ల వరకు కూడా నీటిని విరజిమ్ముతాయి. ఇది పని చేయడానికి 5 హెచ్‌పీ ఇంజిన్‌ కావాలి. బోర్లు, బావులు, కాలువలు, చెరువులు, కుంటల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. నీటి వనరులున్న ప్రాంతం వద్ద ఆయిల్‌ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి పైపుల ద్వారా నీటిని రెయిన్‌గన్‌కు అందిస్తే అది నీటిని చిమ్ముతుంది. ఎక్కడి నుంచో నీటిని తీసుకొచ్చి చేలను తడుపుతామనడం అశాస్త్రీయమని నిపుణులు చెబుతున్నారు. 

రెయిన్‌ గన్‌ ప్రయోగం కొత్తేమీ కాదు 
నిజానికి రెయిన్‌గన్ల ప్రయోగం కొత్తదేమీ కాదు. హైదరాబాద్‌లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం(క్రిడా)లో వీటిని పదేళ్ల క్రితమే ప్రయోగించారు. ఒక్కో గన్‌ నిమిషానికి 240 లీటర్ల చొప్పున 24 మీటర్ల చుట్టూ వృత్తాకారంలో నీటిని చిమ్ముతుంది. ఒక్కో విడతకు 1,809 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంటకు 14,400 లీటర్ల నీటిని వెదజల్లుతుంది. అంటే కేవలం 8 మిల్లీమీటర్ల వర్షపాతంతో సమానం. అనంతపురం వంటి జిల్లాల్లోని తేలికపాటి ఎర్రభూముల్లో ఈ నీటి పరిమాణం ఏమాత్రం సరిపోదు. మెట్టప్రాంతాల్లో ఎండిపోయే దశకు వచ్చిన పంటలకు కనీసం 30 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి. భూమిలో 15 సెంటీమీటర్ల లోతు వరకు తడిపినప్పుడు మాత్రమే పంట నిలుస్తుంది. ఇంతటి నీటి తడి ఇవ్వాలంటే రెయిన్‌గన్లు కనీసం 3 గంటల 45 నిమిషాలు పని చేయాలి. రెండు మూడు సార్లు షిఫ్ట్‌ పద్ధతిలో వీటిని ఉపయోగించాలి. ఎకరానికి 30 మిల్లీమీటర్ల వర్షపాతానికి సమానమైన నీటి తడి పెట్టాలంటే 1,21,500 లీటర్ల నీరు కావాలి. ఇంత నీరు అంటే ఒక్కొక్కటి  6 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న 20 ట్యాంకులు కావాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రెయిన్‌గన్లతో ఇచ్చిన నీరు కేవలం 5 మిల్లీమీటర్ల వర్షపాతంతో సమానం. ముఖ్యమంత్రి చెప్పినట్టు కేవలం నాలుగు రోజుల్లో 4 లక్షల హెక్టార్లలో పంటలను కాపాడాలంటే 20 లక్షల ట్యాంకర్లు కావాల్సి ఉంటుంది. రాష్ట్రం మొత్తం వెతికినా ఇన్ని ట్యాంకర్లు గానీ, నీళ్లు గానీ కనిపించవు. అంటే నీరు, ట్రాక్టర్లు లేకుండా రెయిన్‌ గన్లు కొనుగోలు చేసి, కమీషన్లు మింగేశారే తప్ప వాటివల్ల దమ్మిడీ ప్రయోజనం లేకుండా చేశారు. 

రైతులకు సగం సబ్సిడీ..
రెయిన్‌ గన్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇస్తుంది. రైతులే కొనుక్కుంటామంటే వారికున్న పొలాన్ని బట్టి రాయితీ ఇస్తుంది. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు 90 శాతం, ఆపైన ఉండే వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ పాలసీ.. ఎకరా పంటపై నీటిని చల్లేందుకు రూ.3 వేల వ్యయం అవుతుందని అంచనా వేసి ఇందులో సగం అంటే రూ.1,500లను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నమాట. రైతులు కొనగా మిగిలిన రెయిన్‌ గన్స్‌ను ప్రభుత్వమే భద్రపరచాల్సి ఉంది. ఈ రెయిన్‌ గన్స్‌ కిట్లను వ్యవసాయ శాఖ గోదాములలో భద్రపరిచినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. వీటి నిర్వహణకు 103 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా తెలిపింది. వాస్తవానికి రెయిన్‌గన్స్‌ను రైతులెవరూ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అన్నీ టీడీపీ నేతల ఇళ్లకు చేరిపోయాయి.

2016 ఆగస్టు 28
‘‘వరుణ దేవుడు కరుణించకపోయినా మీరెవరూ భయపడాల్సిన పని లేదు. వర్షం కురవకపోయినా రెయిన్‌ గన్‌లతో వర్షం కురిపిస్తా. మీ పంటను కాపాడే బాధ్యత నాదీ’’ 
– అనంతపురం జిల్లా గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో రెయిన్‌ గన్‌ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట

2016 సెప్టెంబర్‌ 12 
‘‘చంద్రబాబు వస్తారని ఆగస్టు 27 రాత్రి నా పొలం పక్కన ఓ కుంట తవ్వారు. అందులో ప్లాస్టిక్‌ పట్టా వేసి ట్యాంకర్లతో నీటిని నింపారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 10 నిమిషాలు రెయిన్‌గన్‌లు నడిపారు. ముఖ్యమంత్రి అటుపోగానే రెయిన్‌ గన్లతోపాటు పట్టాను, పైపులను తీసుకుపోయారు. ఐదు ఎకరాలకు రెండు ఫైరింజన్ల నీళ్లు ఏం సరిపోతాయి? పంట పూర్తిగా ఎండిపోయింది. బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలసవెళ్లా’’ 
– శివన్న, రైతు, గుండువారిపల్లి, ఆమడగూడూరు మండలం, అనంతపురం జిల్లా

2018 డిసెంబర్‌ 26 
‘‘రెయిన్‌ గన్‌లతో లక్షలాది ఎకరాల్లో పంటలను కాపాడాం. ప్రస్తుతం రబీలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలో సైతం 15,296 హెక్టార్లలో పంటలకు తడులు అందించాం’’  
– వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement