
వడగళ్ల వర్షానికి నలుగురు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లదెబ్బకు నలుగురు మృతి చెందగా, 200మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి చేతికి వస్తుందనుకున్న పంట కళ్లముందే నాశనం కావటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పలు మండలాల్లో పంటపొలాల్లో వడగండ్లు పేరుకుపోయాయి.
కాగా మంగళవారం రాళ్లదెబ్బలకు ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు తండాకు చెందిన భూక్యా సత్తి వడగండ్ల వర్షం నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. గూడూరు మండలం మచ్చర్లకు చెందిన పశవుల కాపరి ఆవుల పద్మ, ఊట్ల గ్రామానికి చెందిన లింగాల కొమ్మమ్మ వ్యవసాయ బావుల వద్ద వడగండ్ల దెబ్బకు మృతిచెందారు. మరోవ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు.
చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చంద్రుగొండ, దీక్షకుంట, సూరిపెల్లి, లింగగిరి తదితర ప్రాంతాల్లో గొర్రెల మందలు, బర్రెలు పెద్దసంఖ్యలో మృత్యువాత పడ్డాయి. వడగండ్లవానతో పదుల సంఖ్యలో గాయపడినవారు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.పదిమందిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. కాగా పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మిర్చి, మొక్కజొన్న, వరి పంటలతో పాటు మామిడితోటలు దెబ్బతిన్నాయి.