సాక్షి, అమరావతి : ఈ రెండు నెలలు వర్షాలకు కొదవ ఉండదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భరోసా ఇచ్చింది. రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో సరైన వానలు కురవక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు చల్లని కబురు చెప్పింది. ప్రతి ఏటా నైరుతి సీజనుకు ముందు ఒకసారి, రెండు నెలల తర్వాత మరోసారి వర్షాల పరిస్థితిపై రూపొందించే దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) అంచనాలను ఐఎండీ గురువారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, దాదాపు వంద శాతం (8 శాతం +/–) సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆ నివేదికలో వెల్లడించింది. ఈ నెలలో 99 శాతం, సెప్టెంబరులో అంతకు మించి వర్షపాతం కురుస్తుందని తెలిపింది. పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల న్యూట్రల్‌గా ఉన్న ఎల్ నినో పరిస్థితులు క్రమంగా బలహీనపడి లానినా (అనుకూల) పరిస్థితులేర్పడుతున్నాయని, ఇవి రుతుపవనాల సీజను ముగిసే దాకా కొనసాగుతాయని వివరించింది.
మొదటి రెండు నెలలు నిరాశాజనకమే..
నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబరు వరకు ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఇవి మొదటి రెండు నెలలు ఆశాజనకంగా వర్షాలు కురిపించలేదు. జూన్ నెలంతా తేలికపాటి వానలకే పరిమితమయ్యాయి. రుతుపవనాల చురుకుదనానికి దోహదపడే అల్పపీడనాలు, వాయుగుండాలు వంటివి బంగాళాఖాతంలో ఏర్పడకపోవడం ఈ పరిస్థితికి దారి తీసింది. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఖరీఫ్ సీజనులో 19.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరగాల్సి ఉండగా 13.83 లక్షల హెక్టార్లలో మాత్రమే పూర్తయింది. వారం రోజుల నుంచి ఉపరితల ఆవర్తనం, ద్రోణులు, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఈ సీజనులో చెప్పుకోదగిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
పలు జిల్లాల్లో వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలు జిల్లా నంద్యాల, జూపాడు బంగ్లాలో ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం కురిసింది. ఆదోనిలో 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్‌లో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే మొదటి సారని రైతులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 16.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అవనిగడ్డ మండలంలో 53.2 మిల్లీ మీటర్లు కురిసింది.
జల దిగ్బంధంలో 34 గిరిజన గ్రామాలు
తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం స్తంభించిపోయింది. లంక గ్రామాల్లో తాత్కాలిక రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. గంటి పెదపూడిలంక, అనగారలంక, ఉడుమూడిలంక, బూరుగలంక, అరిగెలివారి లంకల్లో రాకపోకలు స్తంభించాయి. పలు మండలాల్లో గోదావరి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ 34 గిరిజన గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి. 2 వేల మంది ముంపు బాధితులను గుర్తించిన అధికారులు వారికి భోజనాలు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దేవీపట్నం–వీరవరం గ్రామాల మధ్య వరద నీరు ఉండటంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment