మన్యం వరికి వర్షాభావం
కమ్ముకుంటున్న కరవు మేఘాలు
ఏజెన్సీలో ఎండుతున్న వరి పొలాలు
పాడేరు: మన్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరవు మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఖరీఫ్ వరి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గిరిరైతులు ఖరీఫ్ సీజన్‌లో వర్షాధారంతోనే సుమారు 70 శాతం వరిసాగు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో వర్షాలు అనుకూలించాయి. గిరి రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపట్టారు. జాలై నాటికే 60 శాతం వరకు వరినాట్లు పూర్తి చేశారు. ఇలా మన్యంలో సుమారు 60వేల హెక్టార్లలో వరినాట్లు వేశారు. పాడేరు డివిజన్‌లో జూన్ నెల సాధారణ వర్షపాతం 14.3 సెంటీమీటర్లు . 33 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు రైతులకు బాగా అనుకూలించాయి. జూలైలో సాధారణ వర్షపాతం 31 సెంటీమీటర్లు.14.5 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. జూలైలో వర్షాలు బాగా తగ్గుముఖం పట్టడంతో క్రమేనా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నాట్లు పూర్తయిన వరిపొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయి.
మండలంలోని కిండంగి, తుంపాడ, కుజ్జెలి, హుకుంపేట మండలం సన్యాసమ్మపాలెం, అడ్డుమండ పరిసరాల్లో చాలా వరకు వరిపొలాలు సాగునీరు అందక బీటలు వారాయి.15 రోజులుగా ఏజెన్సీలో వర్షాలు లేవు. ఒకటి రెండు చోట్ల ఒక మోస్తారు వర్షాలు కురిసినా ఖరీఫ్ రైతులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర లేదు. ఏజెన్సీ అంతటా వర్షాభావ పరిస్థితులు గోచరిస్తున్నాయి. నాట్లు వేయని చోట్ల వరినారు ముదిరిపోతోంది. ప్రస్తుతం మన్యంలో వ్యవసాయ పనులు స్తంభించాయి. మెట్టుభూముల్లో వేసిన చోడిపంటకు కూడా వర్షాభావం వల్ల నష్టం వాటిల్లింది. వరి నారుకు తెగుళ్ల బెడద ఎక్కువైంది. ఉష్ణోగ్రతల వల్ల ఇనుపధాతు లోపం ఎక్కువైంది. వేరుశనగకు ఆకుముడత, రసం పీల్చే పురుగుల తాకిడి పెరిగింది.