కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ బీమా గడువు నేటితో ముగుస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పూర్తిగా వెనుకబడింది. వ్యవసాయ పనులు పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో బీమా గడువు పూర్తవుతుండటం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. గత ఏడాది జూలై 7 నాటికి జిల్లాలో 88,541 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది సాగు 37,848 హెక్టార్లకే పరిమితమైంది.
జూన్ మొదటి వారంలో వర్షం కొన్ని మండలాల్లో మాత్రమే కురవగా.. ఆ తర్వాత జాడ కరువైంది. ప్రస్తుతం నెల రోజులు గడిచినా వరుణుడు ముఖం చాటేశాడు. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మిల్లీమీటర్లు కాగా.. 48.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూలైలో వారం రోజులు గడిచినా చినుకు ఊసే కరువైంది. ఇక వేరుశనగ సాగు 1,20,261 హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు సాగు 6,503 హెక్టార్లు దాటని పరిస్థితి. ప్రభుత్వం వేరుశనగకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకోని రైతులు ఈనెల 9లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వర్షాభావం కారణంగా సాగు 5.41 శాతం మించకపోవడంతో వాతావరణ బీమా ప్రీమియం ఎలా చెల్లించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నేటితో గడువు ముగుస్తుండటం గందరగోళానికి తావిస్తోంది. గత ఏడాదికి సంబంధించి వేరుశనగకు 36 మండలాలకు వాతావరణ బీమా కింద పరిహారం మంజూరైంది.
ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బీమాకు ప్రాధాన్యత పెరిగింది. వెల్దుర్తి మండలంలో వేరుశనగ అధికంగా సాగవుతుండగా.. ఈ విడత వర్షాలు అంతంత మాత్రమే కావడంతో రైతులు వేచిచూస్తున్నారు. ఈ మండలంలో బీమా విషయానికొస్తే ఒక్క రైతు కూడా ప్రీమియం చెల్లించలేదని వ్యవసాయాధికారి రవిప్రకాష్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
వర్షాభావ పరిస్థితులు, ఖరీఫ్ పనులు మందగించడంతో వ్యవసాయ యంత్రాంగం ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జూలై 15 వరకు అన్ని రకాల పంటలు సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు గతంలో వెల్లడించారు. ప్రస్తుతం పది రోజులు గడిచిపోయినా చినుకు రాలకపోవడం, గాలుల తీవ్రత ఉండటం, సమీప రోజుల్లో వర్షాలపై ఆశ కనుమరుగవుతుండటంతో ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపింది.
చినుకు కరువు.. బీమా బరువు
Published Thu, Jul 9 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement