కర్నూలు రూరల్: వరుణుడి కరుణ కొంతే... ప్రభుత్వ చేయూత అంతంతే.. ఈ ఏడాది ఖరీఫ్ సాగు రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నీటిపారుదల సలహా మండలి సమావేశంపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు.
గతంలో మాదిరి కాకుండా ఈ సారి తీర్మానాలను కచ్చితంగా అమలు చేయాలని, నీటి వాటాను రాబట్టేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. అయితే వర్షాలు లేవనే సాకుతో వరి సాగుకు నీరు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే సూచన ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు. ఈ విషయమై ప్రతిపక్ష నాయకులు చర్చకు పట్టుబడితే తప్పించుకునేందుకు వ్యూహం రచించారు. కేవలం అజెండాపై మాత్రమే చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం.
కాల్వల కింద సాగు ఇలా..
తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ), కర్నూలు-కడప కాలువ, ఎస్సార్బీసీ, తెలుగు గంగ, ఆలూరు బ్రాంచ్ కాలువల కింద జిల్లాలో మొత్తం 4,99,837 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. వీటికి అదనంగా గత ఏడాది హంద్రీనీవా కింద 18 వేల ఎకరాల్లో పంటలు వేసుకున్నారు. తుంగభద్ర దిగువ కాలువ కింద 16 మండలాల్లో 192 గ్రామాల పరిధిలో 43519 ఎకరాల ఖరీఫ్ ఆయకట్టు ఉంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి ఈ కాలువకు వచ్చే నీరు దారిమళ్లుతోంది. ఏటా జల చౌర్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలోకి 62 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మరో ఐదు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లెల్సీకి ఈ నెల 24వ తేదీనే 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదైనా ఎల్లెల్సీ నీటి వాటా 24 టీఎంసీలు రాబట్టేందుకు పాలకులు, అధికారులు కృషి చేయాల్సి ఉంది.
నీటి తరలింపును అడ్డుకోవాలి..
కర్నూలు-కడప కాలువ కింద కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్ కడప జిల్లాలో 92001 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది ఈ కాలువకు ఏ మేరకు నీళ్లు ఇస్తారనే అంశంపై ప్రకటన చేయాల్సి ఉంది. కేసీకి కేటాయించిన నీటిని అనంతపురం జిల్లాకు తరలిస్తే ఆయకట్టుకు చుక్కనీరు కూడ ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది అనంతపురం జిల్లాకు 3 టీఎంసీల నీరు తరలిపోవడంతో వరి పంట దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు రబీకి నీరు లేక పొలాలు బీడుపడ్డాయి.
శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని పెంచాలి..
శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తాగు, సాగు నీటి అవసరాలకు ఉపయోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్‌ను నిర్మించారు. పోతిరెడ్డిపాడు ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులెటర్ కాంప్లెక్స్ నుంచి తెలుగు గంగ, ఎస్సార్బీసీ, హంద్రీనీవా కాల్వలకు నీరందుతోంది. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచాలని రాయలసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కనీస నీటి మట్టాన్ని 788 అడుగులుగా నిర్ణయించింది. దీంతో తెలుగు గంగ కింద 1,03,700 ఎకరాలు, ఎస్సార్బీసీ పరిధిలో 1,44,317 ఎకరాల్లో, హంద్రీనీవా కింద 20 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది.
నీరుగారుస్తారా.. నీళ్లిప్పిస్తారా..!
Published Tue, Jul 29 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement