సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రి నాటికి తెలంగాణ పై భాగంలోనూ, కోస్తాంధ్రను ఆనుకుని స్థిరంగానే ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో (శనివారం రాత్రి 9.30 నుంచి ఆదివారం రాత్రి 9.30 వరకు) రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో దక్షిణ దిశగా ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం, ఆవర్తనాల కారణంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత అల్పపీడనం తీరును అంచనా వేయడం సంక్లిష్టంగా ఉందని ఓ అధికారి తెలిపారు. శనివారం రాత్రి నాటికి కాకినాడ, మచిలీపట్నం, విశాఖ, కళింగపట్నం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయన్నారు.
గరిష్టస్థాయికి శ్రీశైలం, ప్రకాశం బ్యారేజి
సాక్షి నెట్‌వర్క్: భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, శనివారం సాయంత్రానికి నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, తుంగభద్రల నుంచి శనివారం సాయంత్రానికి 73,350 క్యూసెక్కుల వరదనీరు వ స్తోంది.విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి కూడా భారీగా వరదనీరు వస్తోంది. దీంతో శనివారం సాయంత్రానికి బ్యారేజీకున్న మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 4.67 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నేడూ విస్తారంగా వర్షాలు
Published Sun, Oct 27 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement