రేపటి నుంచి భారీ వర్షాలు
తెలంగాణ, ఏపీలకు వాతావరణ శాఖ హెచ్చరిక
- ‘క్యుములోనింబస్’ ఏర్పడి ఈదురుగాలులతో వర్షం
- మూడు రోజుల పాటు కురిసే అవకాశం
- పలుచోట్ల మాత్రం సాధారణానికి మించి ఎండలు
- ఖమ్మంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- ‘అరేబియా’లో ఉపరితల ఆవర్తనంతో మందగించిన నైరుతి.. 3 రోజుల్లో పరిస్థితి చక్కబడే అవకాశం
- 12న రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ నుంచి ఉత్తరకోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని.. దానివల్ల బుధవారం నుంచి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం (7వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో తెలంగాణలో.. 8, 9 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు వర్షాలు లేనిచోట మాత్రం అధిక ఎండలు ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో వాతావరణం చల్లబడదని.. రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని చెప్పారు.
రుతుపవనాల విస్తరణకు ‘అరేబియా’అడ్డు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అడ్డుకుంటోందని వై.కె.రెడ్డి తెలిపారు. మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఆవర్తనం కారణంగా.. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోనే నిలిచిపోయాయని... అవి ముందుకు కదలడానికి అనువైన వాతావరణం లేదని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 8 నాటికి తగ్గిపోయే అవకాశం ఉందని.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు బలపడి తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించారు.
ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని చెప్పారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితి వల్లే రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని.. కేరళలో ఓ చోట ఏకంగా 37 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
ఖమ్మంలో 42 డిగ్రీలు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఖమ్మంలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు అధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 3.4 డిగ్రీలు అధికంగా, భద్రాచలంలో 0.7 డిగ్రీలు అధికంగా 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
క్లౌడ్ నైన్.. క్యుములోనింబస్
అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల లెక్క ప్రకారం 50 రకాల మేఘాలున్నాయి. ఎంత ఎత్తులో ఉంటాయి.. అవి ఏర్పడే తీరు, వర్షం వస్తుందా.. రాదా అన్న లక్షణాల ఆధారంగా మేఘాలను వర్గీకరించారు. వీటిలో క్యుములోనింబస్ మేఘాలకు ప్రత్యేక స్థానముంది. ఈ మేఘాలను క్లౌడ్–9గా కూడా పిలుస్తారు. ఇంగ్లిష్ భాషా విశేషణాల ప్రకారం దీనికి అత్యంత ఉన్నతమైన, శక్తివంతమైన అని అర్థం. ఇవి భూ ఉపరితలానికి సుమారు ఏడు కిలోమీటర్లపైన.. అప్పటికప్పుడు భారీగా ఏర్పడుతాయి.
ఇతర మేఘాలకంటే భిన్నంగా ఒక్కసారిగా అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. ఇకఈ మేఘాలకు పైన సిర్రోక్యుములస్ మేఘం ఉంటుంది. ఇవి అత్యంత మందంగా ఉండి.. రుతుపవనాల ముందు ఏర్పడతాయి. అందువల్ల వీటిని రుతుపవనాల రాకకు సూచికగా చెబుతారు. అలాగే స్ట్రాటో, స్ట్రాటస్, నింబో స్ట్రాటస్ మేఘాలు భూ ఉపరితలానికి దగ్గరగా 3 కిలోమీటర్లలోపు ఎత్తులో ఏర్పడుతాయి. ఇవి పలుచగా ఉన్నా.. మంచి వర్షాలనే ఇస్తాయి.