రాజన్నది సువర్ణపాలన | raja sekhar reddy ruling too good | Sakshi
Sakshi News home page

రాజన్నది సువర్ణపాలన

Published Wed, Jan 22 2014 2:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రాజన్నది సువర్ణపాలన - Sakshi

రాజన్నది సువర్ణపాలన

 పేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదల చదువులు, ఉపాధి, వైద్యం ఇలా చెప్పుకుంటూపోతే వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు. రామరాజ్యం చూడలేదు కానీ రాజన్నపాలన, సువర్ణ పాలన చూశాం అంటూ కొనియాడారు. ఆయన నారాయణవనం, కార్వేటినగరం సమైక్య శంఖారావం యాత్ర  సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.    
 
 సాక్షి, చిత్తూరు:
 చిత్తూరు జిల్లాలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత, రెండవ రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలకు జనం మంగళవారం నీరాజనం పలికారు. సమైక్యాంధ్ర నినాదాలతో జగన్ ఫొటో ముద్రించిన స్టిక్కర్లను చేతబట్టుకుని చాలాచోట్ల మహిళలు జగన్ కాన్వాయ్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. పుత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి బయల్దేరిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు రెండువేల మందికిపైగా ప్రజలు, కొండలచెరువు గ్రామ మహిళలు పోటీపడ్డారు. వారిని ఆయన పలకరించారు. వారు చెప్పింది ఆసాంతం విన్నారు. సందర్శకులు అందరినీ పలకరించి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ముందు హైవే దాటేందుకే గంటన్నరకుపైగా సమయం పట్టింది. ఇక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి చెన్నై హైవే జంక్షన్‌కు వచ్చి రోడ్ షో నిర్వహిస్తూ సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం చేరుకున్నారు.
 
 నారాయణవనంలో వైఎస్ విగ్రహావిష్కరణ
 నారాయణవనం వద్దకు జననేత చేరుకోగానే సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, సత్యవేడు జెడ్పీటీసీ మాజీ సభ్యులు బీరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో చిందులేస్తూ జై జగన్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ యువకులు ఉత్సాహంగా తమ నాయకుడ్ని ఆహ్వానించారు. వై.ఎస్.జగన్ ఫొటో, ఫ్యాను సింబల్‌తో ఉన్న స్టిక్కర్లు పెట్టుకుని కార్యకర్తలు జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. నారాయణవనంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్‌ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర సింహం అంటూ నినాదాలు రాశారు. నారాయణవనం కూడలిలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా యువకులు జై జగన్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సభలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యవేడు సమన్వయకర్త ఆది మూలం, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, ఆర్.కె.రోజా, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
 
 ఎనిమిది కిలోమీటర్లు...నాలుగు గంటలు
 నగరి నియోజకవర్గంలో మంగళవారం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. చెన్నై బైపాస్ జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణ శివార్లులోని కావమ్మగుడి వరకు జగన్ నిర్వహించిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్‌షోకు సుమారు 4 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన రోడ్ షో సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. మధ్యలో గంటసేపు భోజనానికి విరామం ఇచ్చారు. పుత్తూరు పట్టణ వీధుల్లో అడుగడుగునా మహిళలు జగన్‌ను చూడాలని కాన్వాయ్ వద్దకు వచ్చారు. దీంతో జగన్ ప్రతి ఒక్కరి వద్ద ఆగి వారికి అభివాదం చేస్తూ, పలుకరిస్తూ, వారి కష్టసుఖాలు అడుగుతూ సాగారు. ఆలస్యమైనా వై.ఎస్.జగన్ రాక కోసం పట్టణంలో రెండు నుంచి మూడు గంటలు మహిళలు పెద్దసంఖ్యలో నిరీక్షిస్తూ ఉండిపోయారు.
 
  పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు జగన్‌ను చూసేందుకు ఎండనూ లెక్క చేయకుండా నిలబడ్డారు. పట్టణ శివార్లులోని చిదా స్పిన్నింగ్ మిల్లు వద్ద కార్మికులు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ వారిని పలకరించారు. అలాగే బైపాస్‌రోడ్ జంక్షన్‌లో బస్సుల్లో నుంచి కిందదిగి చూస్తున్న ప్రయాణికులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఆర్‌డీఎం గేటు వద్ద ఎదురుచూస్తూ ఉన్న చిన్నారులను పలకరించి వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. వారు తమ అభిమాన నాయకుడికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత ఆర్‌టీసీ బస్టాండ్, శ్రీనివాస థియేటర్ వద్ద మహిళలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
 
 కార్వేటినగరం రోడ్డు నుంచి బజారువీధిలోకి ప్రవేశించి రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ కిలోమీటరు దూరం వెళ్లేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అడుగడుగునా మహిళలు రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్‌ను ఆపారు. ప్రతి ఒక్కరినీ జగన్ పలకరిస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాపువీధి, విష్ణుమహల్ ప్రాంతాల్లో దుకాణదారులూ జగన్‌ను చూసేందుకు ఆసక్తిగా రోడ్డుపైకి వచ్చి నిలబడడం కనిపించింది. కుంటకట్ట వద్దకు వచ్చిన సందర్భంలో వెంకటమ్మ అనే మహిళ పక్షవాతంతో బాధపడుతోందని మహిళా సంఘాల వారు నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే.రోజా దృష్టికి తెచ్చారు. ఆమె విషయం జగన్‌కు తెలిపారు. ఆయన స్పందించి పేదరికంతో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వెంకటమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు వైద్యపరమైన సాయం అందించాల్సిందిగా రోజాకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని రకాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే వేదవ్యాస స్కూల్ పిల్లలు జై సమైక్యాంధ్ర నినాదాలు, జగన్ బొమ్మలతో ఉన్న స్టిక్కర్లు చేతపట్టి ఘనస్వాగతం పలికారు.
 
  మార్కెట్‌యార్డు సమీపంలో హిమజా స్కూల్ విద్యార్థులు వందలాది మంది జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మధ్యాహ్నం భోజన విరామానికి వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి ఇంటికి వై.ఎస్.జగన్ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఎస్‌బీఐ కాలనీ, ఆర్‌టీసీ కాలనీ, ఆరేటమ్మగుడి మీదుగా పుత్తూరు పట్టణ శివార్ల వరకు రోడ్‌షో నిర్వహించారు. జగన్ వెంట నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కె.రోజా ఉన్నారు. నెత్తం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో జననేతకు చూసేందుకు పోటీపడ్డారు. బస్సుల్లో వెళుతున్న విద్యార్థులు జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. చిన్నరాజకుప్పం వద్ద ఎస్వీ  పెరుమా ల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పార్టీ జెండాలు చేతపట్టి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నెత్తం, కళ్యాణం గ్రామాల మీదుగా జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రారంభ గ్రామం సురేంద్రపురం వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు నెత్తం సమీపంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చి వేచివున్న వారిని వై.ఎస్.జగన్ పలకరించారు.
 
 జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఘనస్వాగతం
 జీడీ నెల్లూరు నియోజకవర్గం సురేంద్రపురం గ్రామం వద్ద వై.ఎస్.జగన్‌కు నియోజకవర్గ సమన్వయకర్త, కన్వీనర్ కే.నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులందరినీ జగన్ పలకరించారు. పార్టీ బ్యానర్లు తలకు చుట్టుకుని, జెండాలు చేతపట్టి జై జగన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. పద్మాసరస్సు మీదుగా కార్వేటినగరం వరకు రోడ్ షో నిర్వహించారు. రాత్రి 8 గంటలకు కార్వేటినగరం పోలీసుస్టేషన్ మీదుగా బహిరంగ సభా స్థలి అయిన బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్‌షోలో జగన్‌ను చూసేం దుకు వీధుల్లోని అన్ని మిద్దెలపైన జనం వేచి ఉన్నారు. ఇళ్లలోని వారూ రోడ్డుపైకి వచ్చి జగన్‌ను ఆసక్తిగా చూడడం కనిపించింది. బహిరంగసభా స్థలి వరకు అభిమానులు ఏర్పాటు చేసిన బాణసంచా మోతతో కార్వేటినగరం వీధులు మార్మోగాయి.
 
 కార్వేటినగరంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సభకు తమ అభిమాన నాయకుడు రావడం మూడు గంటలు ఆలస్యమైనా జనం కదలకుండా వేచి ఉన్నారు. చివరి వరకు ఉండి జగన్ ప్రసంగం విన్నారు. అక్కడ నుంచి బండరేవు కాలనీ, ఆర్‌కేవీపేట, రాజులకండ్రిగ మీదుగా రోడ్‌షో నిర్వహించారు. పాదిరి కుప్పం, ఆల్లాగుంట, తురకమిట్ట, కొల్లగుంటల్లోనూ ప్రజలను పలుకరిస్తూ రోడ్‌షో చేశారు. ఎన్‌టీఆర్ నగర్, లక్ష్మీపురంక్రాస్, ముద్దుకుప్పంక్రాస్, సనకుప్పం మీదుగా జగన్ రాత్రి 11 గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తూ రాత్రి బస అయిన నెలవాయి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement