ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర నిర్వహిస్తారన్న సమాచారం వచ్చింది. భువనేశ్వరి నిజం గెలవాలి అనే బ్యానర్‌తో తిరుగుతారట. వాస్తవమే.. నిజం గెలవాలి! ఏ నిజం గెలవాలి? అన్నదే ప్రశ్న. మొన్నటి వరకు న్యాయం గెలవాలి అన్నారు. ఇప్పుడు నిజానికి మారారు. ఏది నిజమో? ఏది అబద్దమో? ప్రజలకు తెలియకుండా చేయాలన్న వారి ఆలోచన కనబడుతూనే ఉంది.
చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుల్లో గట్టిగా వాదించలేకపోతున్న తరుణంలో.. ప్రజల్ని ఏమార్చడానికి భువనేశ్వరి ఈ కార్యక్రమం తీసుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నిజంగానే ఎవరైనా దానిని తట్టుకోలేక మరణించారా ? అనేది కూడా చూడాలి. అది ఎంతవరకు నిజమనేది కూడా భువనేశ్వరి ఆలోచించుకోవాలి. గతంలో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేసిన సందర్భం వేరు. ఆ పరిస్థితులువేరు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.అది ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ప్రజలందరిని తీవ్రంగా కలచి వేసింది. కొందరు ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుకో, మరో తీవ్ర అస్వస్థతతోనో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియానే సంబంధిత వివరాలను కవర్ చేసింది కూడా. వాటి ఆధారంగానే జగన్ అలా మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
✍️అప్పట్లో జగన్ కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయా కుటుంబాలవారిని ఒకచోటకు తెచ్చి సాయం చేయాలని సూచించారు. ఓదార్పు యాత్ర మాదిరి వారి ఇళ్లకు వెళ్లవద్దని ఆదేశించారు. కానీ, అందుకు జగన్ ఒప్పుకోలేదు.అలా అందరిని ఒకచోటకు తీసుకు వచ్చి సాయం చేయడం మర్యాద కాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ లోని ఒక వర్గం ఇదంతా జగన్ తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి, సీఎం పదవి పొందడానికి అని పితూరీలు చేసేది. వారినెవరిని ఆయన ఖాతరు చేయలేదు.తను అనుకున్న బాటలోనే ఆయన ముందుకు వెళ్లారు. ఏదో రకంగా కేసులుపెడతారని తెలిసినా జగన్ వెనక్కి తగ్గలేదు. అది ఆయన ధైర్యం. కొందరుదానిని మొండి తనం అని అన్నా ఆయన పట్టించుకోలేదు. చివరికి నిజంగానే ఆయన దాని కారణంగా అనేక కష్టాలు పడ్డారు. జైలుకు వెళ్లేలా తప్పుడు కేసులుపెట్టారు. సోనియాగాంధీకి తోడు చంద్రబాబునాయుడు కూడా తోడై జగన్ ను ఇబ్బంది పెట్టడానికి పోటీపడ్డారు. వాటన్నిటిని ఎదుర్కుని 2014 విభజిత శాసనసభ ఎన్నికలలో పోటీచేసినా, ఆయన అధికారంలోకి రాలేకపోయారు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమై తనకంటూ ఒక ఎజెండా తయారు చేసుకుని ప్రజలలోకి వెళ్లి వారి మన్ననలు పొందారు. అది అప్పటి చరిత్ర.
మరి ఇప్పుడు.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో మామూలుగా జనంలో తిరిగితే తిరగవచ్చు. కానీ ఆమె ఓదార్పు యాత్ర చేస్తారన్నదే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. ముందుగా చంద్రబాబు అరెస్టు కారణంగానే ఎవరైనా మరణించారా? అనే విషయాన్ని ఆమె నిర్ధారించుకోవాలి. ఎందుకంటే టీడీపీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివే ఏదో పేరుకు అలాంటి వార్తలు ఇస్తున్నారు తప్ప.. వారికి తెలుసు అవన్నీ అవాస్తవాలని!. అందుకే ఆ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతిలలో వచ్చిన విధంగా ఎవరైనా చంద్రబాబు కోసమే మరణించారా? అని సాక్షి మరికొన్ని మీడియా సంస్థలు కూపీ లాగి అసలు విషయాలు బయటపెట్టేస్తున్నారు.
✍️ఏ ఊళ్లో ఎవరు మరణించినా వారిని ఈ ఖాతాలో వేశారని.. పేర్లు,వారికి ఉన్న వ్యాధి,మరణించిన తీరు మొదలైనవాటిని ప్రచురిస్తున్నారు. అలాంటప్పుడుఈ విషయంలోనే నిజం చెప్పలేని టీడీపీ నేతలు.. భువనేశ్వరితో నిజం గెలవాలి అని ఎలా కార్యక్రమం చేపడతారో తెలియదు. ఎవరైనా అవినీతికేసులో అరెస్టు అయితే వారి కోసం కొందరు మరణించే పరిస్థితి ఉంటుందా?. ఒక నాయకుడి మరణానికి, ఒక నాయకుడి అరెస్టుకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించలేరా?. జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు దానిని కాంగ్రెస్లోని ఒకవర్గంతో పాటు తెలుగుదేశం కూడా తప్పు పట్టింది. మరి ఇప్పుడు భువనేశ్వరి అలాంటి ఓదార్పు యాత్రను చేయడం ఎంతవరకు నైతికంగా సమంజసం?.
✍️ప్రతిదానిలో డబుల్ గేమ్ ఆడడం టీడీపీకి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచే అలవాటు. ఇప్పుడు భువనేశ్వరి అదే దారిలో వెళ్లబోతున్నారా? జనంలోకి వెళ్లి ఏమని చెబుతారు?. ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ఆరోపిస్తారు. ఇప్పటికే ఆ పని చేస్తున్నారు. చంద్రబాబు కాని, ఆయన లాయర్లుకాని చెప్పలేని నిజాలు ఏమైనా భువనేశ్వరి చెబుతారా? సెక్షన్17ఏ చంద్రబాబుకు వర్తించదని కోర్టులు అభిప్రాయపడడం తప్పు అని ఆమె చెబుతారా. దానిని నిజం అని నమ్మమని ఆమె చెబుతారా?. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు పారిపోయిన విషయం అవాస్తవమని చెబుతారా?. టీడీపీకి ఖాతాకు నేరుగా రూ.27 కోట్లు వచ్చాయని సీఐడీ అభియోగం మోపింది. ఆ డబ్బు పార్టీ ఖాతాలోకి రాలేదని రుజువుచేసే పరిస్థితి భువనేశ్వరికి ఉంటుందా? చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే చివరికి 17ఏని పక్కనబెట్టి ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని మద్యంతర బెయిల్ ఇవ్వాలని, కావాలంటే మళ్లీ జైలుకు పంపవచ్చని అనడం నిజం కాదని భువనేశ్వరి అనగలరా? తన కుమారుడు లోకేష్ ఈ కేసులో చంద్రబాబు అరెస్టు అయింది మొదలు డిల్లీలోనే ఎక్కువ రోజులు ఎందుకు బస చేస్తున్నారు? అందులో ఉన్న మతలబు ఏమిటో ఆమె వివరిస్తారా? ప్రజల కోట్ల సొమ్ము చంద్రబాబు బృందం స్వాహా చేసిందన్నది సీఐడీ ఆరోపణ. అలా జరగలేదని భువనేశ్వరి అంటారు.ఓకే. మరి నిజం ఏమిటో కూడా ఆమె తెలియచేయాలి కదా? ప్రజలను మభ్య పెట్టి సానుభూతి పొందాలన్న ప్రయత్నం చేయడమే తప్ప ఆమె నిజం చెప్పడానికి ఓదార్పు యాత్ర చేయరన్న సంగతి తెలుస్తూనే ఉంది.
చంద్రబాబు బెయిల్ కోసం ఎందుకు భువనేశ్వరి మొదటే యత్నించలేదు? ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు చంద్రబాబును రిమాండ్లో పెట్టాయన్న సంగతి భువనేశ్వరికి తెలియదా? చంద్రబాబును విడిచిపెట్టాల్సింది కోర్టులు తప్ప, ఏపీ సీఐడీనో, లేక ప్రభుత్వమో కాదన్న సంగతి భువనేశ్వరికి తెలియదా?. చంద్రబాబు మాజీ పీఎస్. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్ చాలా రోజులు కనిపించకుండా వెళ్లి, ఒకరోజు సీఐడీ విచారణకు హాజరై, రెండో రోజు గాయబ్ అవడంలో ఆంతర్యం ఏమిటోకూడా భువనేశ్వరి తెలుపుతారా? జీఎస్టీ అధికారులు, ఈడీ అధికారులు ఇప్పటికే ఈకేసును చెప్పట్టడం నిజం కాదని ప్రజలకు ఆమె చెప్పగలరా?
✍️ప్రస్తుతానికి ఇది ఒక్కటే కేసు కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్ కేసులు ఎదురు చూస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లింగమనేని రమేష్ ఇంటికి భువనేశ్వరి ఎందుకు రూ. 27 లక్షల అద్దె చెల్లించారు? ఆమెకు ఈ ఇంటికి ఏమి సంబంధం. అది ప్రభుత్వ భవనమని కదా గతంలో ఆమె భర్త ప్రచారం చేసింది?. హెరిటేజ్ సంస్థ పేరుతో కంతేరు వద్దే ఎందుకు భూమి కొనుగోలు చేశారో కూడా ప్రజలకు నిజం చెబుతారా?ఇక లోకేష్ కూడా భవిష్యత్తుకు గ్యారంటీ అనే ప్రచారం చేపడతారట. ఆ హామీలే పెద్ద బోగస్ .వాటిని ప్రజలకు చెప్పడం అంటే వారిని మోసం చేయడమే. అసలు లోకేష్ భవిష్యత్తుకే గ్యారంటీ లేని పరిస్థితిలో ఆయన జనానికి ఏమి గ్యారంటీ ఇస్తారో తెలియదు. ఏది ఏమైనా తల్లి ,కొడుకులు మాత్రమే జనంలో పర్యటనలు చేస్తారా?లేక కోడలు బ్రాహ్మణి కూడా రంగంలో దిగుతారా అన్నది తెలియదు. తమ యాత్రల ద్వారా సానుభూతి సంపాదించాలన్న వారి యత్నం వికటించడానికే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పాలి.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment