ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘నైపుణ్యాభివృద్ది సంస్థ కుంభకోణం’లో చిక్కి జైలు పాలు కావడంతో.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమి అవుతుందో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పార్టీపై ఇప్పటికే పట్టు సడలుతున్న తరుణంలో.. పులిమీద పుట్రలా చంద్రబాబుపై కేసులు రావడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు లోకేష్ కూడా కేసులలో ఉండడం ఆ పార్టీ క్యాడర్‌కు మరింత ఆందోళనకరంగా మారింది. ఇదే టైమ్‌లో పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు వియ్యంకుడు , హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హల్ చల్ చేయడం పార్టీని మరింత గందరగోళంలో పడేసింది. ఇవి చాలవన్నట్లు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి.. రంగంలోకి రావాలని, టూర్‌లు చేయాలని సూచించడం ఆ పార్టీలో ఏర్పడిన అయోమయ స్థితికి దర్పణం పడుతోంది.
ఈ మధ్యకాలంలో చంద్రబాబు.. కొన్ని పేర్లతో రాష్ట్రంలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దూషణలు చేస్తూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగాలు సాగించారు. అలాగే యువగళం పాదయాత్ర పేరిట లోకేష్ కార్యకర్తలలో గరళం నూరిపోస్తూ.. హింసకు ప్రేరిపిస్తూ వచ్చారు. వాటి ఫలితంగా పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో కేసుల పాలై జైళ్లలో పడ్డారు. వాళ్లను ఆదుకునే పరిస్థితి టీడీపీ నాయకత్వానికి లేకుండా పోయింది. ఎన్ని ఎక్కువ కేసులు నమోదు అయితే.. ఆ వ్యక్తికి అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తండ్రే రాజమండ్రి జైలులో ఉండవలసి వచ్చింది. దాంతో ఢిల్లీ నుంచి పెద్ద,పెద్ద లాయర్లను ప్రత్యేక విమానాలలో రప్పించి కోర్టులలో వాదనలు చేయిస్తున్నారు. వారేమో అవినీతి జరగలేదని చెప్పలేకపోతున్నారు. కేవలం సాంకేతిక అంశాలపైనే వాదనలు చేస్తుండడంతో పార్టీ క్యాడర్‌కు తమ నేత అవినీతి చేసి దొరికిపోయాడన్న భావన నెలకొంది. అదే టైమ్ లో చంద్రబాబు,లోకేష్‌ల మాట నమ్మి హింసాకాండకు తెగపడ్డ కార్యకర్తలు ,స్థానిక నేతలు దిక్కులేక అల్లాడుతున్నారు. వారిలో ఆర్ధికంగా స్థితిమంతులైనవారు కొద్దిమంది ముందస్తు బెయిల్ పొందినా, తొంభై శాతం మంది జైళ్లలోనే మగ్గవలసి వచ్చింది. దాంతో టీడీపీ క్యాడర్‌కు కనువిప్పు అయింది.
✍️ చంద్రబాబు, లోకేష్‌లు తమ పరపతి ఉపయోగించి.. పెద్ద,పెద్ద లాయర్లను కాకపోయినా, ఓ మోస్తరు లాయర్లను పెట్టి తమను ఎలాగో కేసుల నుంచి బయటవేస్తారని భావించిన కార్యకర్తలకు సీన్ రివర్స్ అవడం జీర్ణం కావడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడే బెయిల్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం అంతా టీడీపీకి పెద్ద షాక్‌గా మారింది. వాస్తవ పరిస్థితి అర్ధం అయ్యేసరికి టీడీపీ నాయకత్వం బంద్ కాల్ ఇచ్చినా.. పెద్దగా బయటకు రాకుండా క్యాడర్ జాగ్రత్తపడింది. కొందరు నేతలైతే పోలీసులను అభ్యర్ధించి మరీ హౌస్ అరెస్టు అయ్యారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి ఎంత ప్రచారం చేసినా.. నమ్మలేకపోతున్నారు. దానికి కారణం.. కోర్టు చంద్రబాబును రిమాండ్ విధించి.. రాజమండ్రి జైలుకు పంపడమే!.
చంద్రబాబు రిమాండ్ వెనుక.. ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టు ఇలా చేయరన్న సంగతిని వాళ్లు(టీడీపీ క్యాడర్) అర్ధం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు కాని, మంత్రులు.. అధికారులు కాని ఆ స్కామ్లో చంద్రబాబు పాత్రను ఆధారసహితంగా చెబుతుండడంతో టీడీపీ క్యాడర్‌కు వాస్తవ పరిస్థితి అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు తీసుకు వచ్చినా, విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు తీసుకు వెళ్లినా రోడ్ల వెంట నిలబడి ఆయనకు కనీసం సంఘీభావం కూడా తెలపలేదు.
✍️ ఇక చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా.. ఇతరత్రా పిటిషన్‌లు ఆయన లాయర్లు వేయడంతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఈ కేసులో చంద్రబాబును తప్పించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసినా.. అది ఏమవుతుందో తెలియదు. కాని, ఈలోగా చంద్రబాబు జైలులోనే గడపవలసి రావడం పార్టీ క్యాడర్‌ను డీమోరలైజ్ చేస్తోంది. అందుకే పార్టీ నాయకత్వం ఎన్ని రకాలుగా పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందించడం లేదనేది స్పష్టమవుతోంది.
మరోవైపు లోకేష్‌పై కూడా కేసుల కత్తి వేలాడుతోంది. తనకు ఏమవుతుందో తెలియక ఆయన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యమంత్రిని, పోలీసులను నోటికి వచ్చినట్లు దూషించినంత తేలికగా కేసులు ఉండవన్న సంగతి అర్దం అయ్యేసరికి లోకేష్ ఊబిలో చిక్కుకుపోయారు. ఆయన కూడా అరెస్టు అయితే పార్టీని నైతికంగా మరింత దెబ్బతీస్తుంది. అసలే ఆయన నాయకత్వంపై ఇంకా నమ్మకం ఏర్పడలేదు. దానికి తోడు ఈ కేసులు రావడంతో వీళ్లతో జట్టుకట్టి ఉంటే ఏమవుతామోనన్న భయం క్యాడర్‌కు పట్టుకుంది.
✍️ మరోవైపు.. చంద్రబాబు, లోకేష్‌లు సంక్షోభంలో ఉండగా.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ కార్యాలయంలో హల్ చల్ చేశారన్న వార్తతో క్యాడర్‌లో అయోమయం నెలకొంది. తన కుమారుడు బాలకృష్ణ రాజకీయ వారసుడు కావాలని ఎప్పుడో 1986 ప్రాంతంలోనే ఎన్.టి.రామారావు ప్రకటన చేయడం, దానిని విత్ డ్రా చేసుకునే వరకు చంద్రబాబు ప్రయత్నాలు సాగించడం తెలిసిందే. ఇప్పుడు పార్టీ మొత్తం నారా వారి పార్టీగా మారిపోయి.. నందమూరి వంశానికి ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అభిప్రాయం బలంగా జనాల్లోనే ఉంది. అందువల్ల బాలకృష్ణ ఏమైనా చొరవ తీసుకునే.. ధైర్యం చేశారా? అనే చర్చ నడిచింది క్యాడర్‌లో!. ఇంతకాలం చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వం అని భావిస్తుంటే, బాలకృష్ణ వచ్చి చంద్రబాబు సీటులో కూర్చోవడం.. ఆయనకు సంబందించిన వార్తలేవి చంద్రబాబు సన్నిహితంగా ఉండే ఆంధ్రజ్యోతిలో రాకపోవడంతో.. బాలకృష్ణ చేసిన హడావుడి ఆ తండ్రీకొడుకులకు నచ్చలేదా? అనే ప్రశ్న తలెత్తింది కూడా!. ఒకవేళ బాలకృష్ణ తానే నాయకత్వం వహించాలనుకుని ఇలా చేశారా? అనే అనుమానమూ పార్టీ వర్గాలలో ఏర్పడింది.
ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కొద్ది రోజుల కిందట.. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు కూడా రంగంలో దిగాల్సిన సమయం ఆసన్నమైందంటూ కథనం రావడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరచింది. అంటే దీని అర్ధం చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేరనా?.. లేక చంద్రబాబు నాయకత్వ పటిమపై సందేహాలు వచ్చాయా? లేదంటే లోకేష్ కూడా జైలుకు వెళతారనా? లేకుంటే లోకేష్ నాయకత్వం సరిపోదనా?. ఒకవేళ వీరిద్దరూ(భువనేశ్వరి, బ్రహ్మణీలు) రావడం వల్ల జనంలో సానుభూతి వస్తుందనా?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేక క్యాడర్‌ను వేధిస్తున్నాయి.
✍️ గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి విజయమ్మలు పర్యటనలు చేశారు. సభలలో మాట్లాడారు. కాని అప్పుడు అది ఉప ఎన్నికల సమయం కావడంతో.. వారి అవసరం పడింది. అలాగే షర్మిల పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు కేవలం చంద్రబాబు జైలులో ఉన్నారు కనుక వీరు జనంలోకి వస్తే రిసీవ్ చేసుకుంటారా?. ఒకవేళ చూడడానికి వచ్చినా జనం.. ఆ తర్వాత ఓట్ల వరకు పరిస్థితిని తెస్తారా? అనేది అనుమానమే!. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు ఈ పరిణామాలన్నిటికి జైలులో ఉన్న చంద్రబాబు అంగీకరిస్తారా?.. దానివల్ల తన రాజకీయ అనుభవానికి.. పరువుకి భంగం అనుకునే అవకాశం ఉండదా?.. ఇలా ఎన్నో చిక్కుల నడుమ తెలుగుదేశంలో నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి.
టీడీపీ క్యాడర్‌ను ఎంత ఉత్తేజపరచాలని చూస్తున్నా.. రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా.. వారిలో ఆ కాక కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇన్ని రోజులు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు వాళ్లే ఇక్కట్లపాలయ్యారని, అందువల్ల అనవసరంగా తాము ఎందుకు రిస్క్ తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు సహజంగానే భావించి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందనిపిస్తోంది. ‘‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ’’ నినాదం ఇచ్చిన పార్టీలో.. ఇప్పుడు ఆ పిలుపు ఇచ్చిన చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్‌ల భవితవ్యంతో పాటు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయిందన్న భావన ఆ పార్టీ క్యాడర్‌లోనే నెలకొంది!!.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment