ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపైకి కొత్త పాత్ర ప్రవేశించింది. ఆమె ఎవరో వేరే చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ పాత్ర ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. అవినీతి కేసులో జైలులో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన భార్య నారా భువనేశ్వరి యాత్ర ఆరంభించారు. ఆమె వచ్చే శాసనసభ ఎన్నికలలో తాను కూడా పోటీచేయాలని ఆలోచిస్తూ ఈ యాత్ర చేస్తున్నారేమో తెలియదు. నిజం గెలవాలి అనే బ్యానర్ ఆమె చేబూని తిరగడం ఆరంభిస్తే, అవును.. నిజం గెలిచింది ..అందుకే చంద్రబాబు జైలులో ఉన్నారు.. అని వైఎస్సార్‌సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజం పూర్తిగా గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక 150 మంది మరణించారట. వారి కుటుంబాలను ఓదార్చడానికి ఈమె యాత్ర చేస్తున్నారట. భర్త జైలులో ఉంటే.. రాజమహేంద్రవరంలో క్యాంప్ ఇంటిలో ఉండి ఆయనకు అవసరమైన ఆహారం, మందులు వంటివాటిని పంపిచే బాధ్యతను తొలుత చేపట్టిన భువనేశ్వరి, ఆపై ఆ పని మాని జనంలో సానుభూతి కోసం తిరగడం ఆరంభించారు. ఆ సందర్భంగా ఆమె ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాన్ని చదువుతున్నారు. తప్పు లేదు. కాకపోతే అందులో ఉన్న నిజాలు ఎన్ని అన్నదే ప్రశ్న.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే, ఆ పార్టీ ఉనికి కోల్పోతుందన్న భయం, దానికి మించి చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల ఉచ్చు మరింత బిగిస్తుందనే ఆందోళన, తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు గోవిందా అవుతుందన్న అనుమానం వంటి కారణాలతో భువనేశ్వరి ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం ఒకవిధంగా కొత్త విన్యాసం చేస్తోందని చెప్పాలి.
తమ నాయకుడిని అరెస్టు చేస్తేనే దానిని తట్టుకోలేక మరణిస్తున్నారని జనాన్ని నమ్మించడానికి యత్నిస్తూ, అందుకు కొంత పెట్టుబడి కూడా పెడుతోంది. తద్వారా చంద్రబాబు అమాయకుడని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ప్రజలలో ప్రచారం చేయాలన్నది వారి లక్ష్యం. నిజం ఏమిటో చంద్రబాబుకు తెలుసు! భువనేశ్వరికి తెలుసు. లోకేష్‌కు తెలుసు. బహుశా బ్రాహ్మణికి కూడా తెలిసి ఉండాలి. అయినా జైలులో ఉన్న చంద్రబాబు సూచన మేరకు ఈ డ్రామాను ఆరంభించి ఉండాలి.
భువనేశ్వరి ఏమి చెబుతున్నారంటే.. చంద్రబాబు కేసుల్లో అసలు ఆధారాలు లేవట. అయితే చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసును ఆమెకు చూపించి, అందులో చంద్రబాబుకు ఎలా ,ఎక్కడెక్కడ ముడుపులు ముట్టాయన్న విషయం చాలా స్పష్టంగా తెలిపిన విషయాన్ని వివరించాలి. అయినా ఆమె బుకాయించవచ్చు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ షాపూర్జిపల్లంజీ ప్రతినిధి మనోజ్ నుంచి ముడుపులు ముట్టాయని వాంగ్మూలం ఇచ్చిన సంగతి గురించి ఆమె మాట్లాడగలరా? ఆదాయపన్ను శాఖ నోటీసులోని అంశాలతో కాని, అంతకుముందు శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు సీబీటీడీ చేసిన ప్రకటన గురించి ఆమె ఏమైనా చెప్పగలరా?. రాజకీయాలు చేయడానికి రాలేదంటూనే రాజకీయాలు మాట్లాడిన ఆమె అచ్చం అబద్దాలనే తన ఉపన్యాసంలో చెప్పినట్లు అర్ధం అవుతుంది.
చివరికి ఆమె ఇచ్చి న మూడు లక్షల రూపాయల చెక్కు లో కూడా అబద్దం ఉండడం విశేషం. చంద్రబాబు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్టు అయితే, ఆయన సెప్టెంబర్ మూడవ తేదీనే ఎలా సంతకాలు చేశారన్నది సహజంగానే వచ్చే ప్రశ్న.
చంద్రబాబు తమ జీవితాలలో వెలుగులు నింపుతారని ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని ఆమె అన్నారు. నిజంగా ఆ నమ్మకం ఉంటే గత శాసనసభ ఎన్నికలలో టిడిపిని 23 సీట్లకే ఎందుకు పరిమితం చేస్తారు?. చంద్రబాబు ఐదేళ్లపాలనపై ఎందుకు అంత ఆగ్రహం ప్రదర్శిస్తారు!. ఏపీని చీకటి పాలు చేశారనే కదా ఆ ఓటమి ఎదురైంది.
ఆయన హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తే అప్పట్టో అవహేళన చేశారని మరో అబద్దం చెప్పారు. నిజానికి అంతకు కొన్ని ఏళ్ల ముందే నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇదే ప్రాంతంలో సాఫ్ట్ వేర్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన విషయం దాచి వేయాలన్నది ఆమె ఉద్దేశం కావొచ్చు. ఆయన 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం ఒకటి కట్టించారు. దానిపై కూడా అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఆనాటి ప్రతిపక్ష నేత పి.జనార్దనరెడ్డి ఈ భవన నిర్మాణంలో జరిగిన అవినీతిపై పలు విషయాలు చెబుతుండేవారు. అది వేరే సంగతి. ఆ తర్వాత మూడేళ్లలో ఆయన ఓటమి చెందారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చారు. ఆయన హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి సంస్థలు వచ్చాయి. అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే తదితర సదుపాయాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతంలో అనేక కొత్త వంతెనలు వచ్చాయి. అనేక ప్రైవేటు సంస్థలు ప్రైవేటు భూములలో భవంతులు కట్టాయి. ఇరవైఏళ్ల క్రితం సి.ఎమ్. గా చేసిన చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ ను తానే నిర్మించానని క్లెయిమ్ చేసుకోవడం అతిశయోక్తి తప్ప ఇంకొకటికాదు.
నిజంగానే చంద్రబాబుకు అంత అభివృద్ది దృష్టి ఉంటే విభజిత ఏపీలో ఐదేళ్లపాటు పాలించి ఎందుకు ఐటి కంపెనీలను రాబట్టలేకపోయారు?ఎక్కడ ఏ అభివృద్ది జరిగినా అదంతా తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి కూడా అదే బాట పట్టినట్లున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారట. అంతే తప్ప పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు దగ్దం చేయడం, ఒక పోలీసుకు కన్ను పోవడం.. ఇవేమీ అసలు హింసకిందకు రావని ఆమె అనుకుంటున్నారేమో తెలియదు. న్యాయాన్ని జైలులో నిర్భంధించారట. చంద్రబాబు కోసం జనం రోడ్ల మీదకు వచ్చారట. అవన్నీ నిజం అయితే ఆమె ఇప్పుడు ఓదార్పు యాత్ర డ్రామాకు తెరదీయవలసిన అవసరం ఏమి ఉంటుంది. లోకేష్ సమర్ధతపై నమ్మకం లేకే చంద్రబాబు తన భార్యను రంగంలో దించారన్నది ఒక అభిప్రాయంగా ఉంది. తెలుగు పౌరుషం అంటే ఏమిటో ఎన్.టి.ఆర్.చెప్పారట. మరి అలాంటి ఎన్.టి.ఆర్.ను తన భర్త దారుణంగా అవమానించి పదవి నుంచి దించేయడాన్ని ఏమనాలి. అసలు చంద్రబాబు గురించి ఎన్.టి.ఆర్. ఏ స్థాయిలో దూషించింది భువనేశ్వరి తెలియనట్లే నటిస్తున్నారు. ఎంతైనా చంద్రబాబు భార్య కదా! అచ్చం ఆయన మాదిరే నటనావైదుష్యాన్ని ప్రదర్శించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
మహిళగా ఆమె బాధను అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఒక భార్యగా ఆమె బాధపడడంలో తప్పు లేదు. మరి రాజమహేంద్రవరంలోనే గోదావరి పుష్కరాలలో వీరి స్నానం కారణంగా తొక్కిసలాట జరిగి మృతి చెందిన 29 మంది కుటుంబాల బాధను ఏమనాలి. చంద్రబాబు సభల కారణంగా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటలు జరిగి పదకుండు మంది మరణించారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారా! చంద్రబాబు ప్రజాధనం వందల కోట్లు కొల్లగొట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నప్పుడు కోర్టులు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపుతున్నప్పుడు న్యాయాన్ని నిర్భందించడం ఎలా అవుతుంది?. సెంటిమెంట్ డైలాగులు వాడితే జనం పడిపోతారా!
న్యాయం,చట్టం ఎవరికైనా ఒకటే నని ఇన్నాళ్ల తర్వాత తేలుతోందని ప్రజలు భావిస్తున్నారు. వయసుకు ,అవినీతి కేసులకు సంబంధం లేదని పలు ఉదాహరణలు చెబుతున్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి రాసుకు వచ్చిన ప్రసంగం చదువుతూ ప్రజలలో సానుభూతిని ఆశిస్తున్నారు. కాని, అక్కడ కూర్చున్న మహిళల ముఖాలు చూస్తే ఈమె ఏమి చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారనిపించింది. చంద్రబాబు భార్యగా ఆమె అబద్దాలు చెబుతున్నారు తప్ప, ఎన్.టి.ఆర్.కుమార్తెగా నిజాలు చెప్పాలని ఆమె అనుకోవడం లేదు. ఆ విషయం ప్రజలకు ఇట్టే బోధపడుతోంది.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment