హుజూర్‌నగర్ సభలో వైఎస్ జగన్ ప్రసంగం
నల్లగొండ: రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే తన సోదరి షర్మిల ఓదార్పు కార్యక్రమం మొదలుపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్‌లో జరిగిన వైఎస్ఆర్ జనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ సిపికి మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్ సువర్ణయుగం తెచ్చుకుందాం అని పిలుపు ఇచ్చారు. సిఎం అంటే ఇలాగే ఉండాలని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వైఎస్ఆర్ చూడలేదన్నారు. ప్రతి పేదవాడి మనసు ఎరిగి ఆయన పాలన చేశారని చెప్పారు.
రాష్ట్రాలు విడగొట్టారు కానీ తెలుగు జాతిని, తెలుగు ప్రజలను విడగొట్టలేదన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయం అంటే విశ్వసనీయత ఉండాలన్నారు. రాజకీయం అంటే ప్రతి పేదవాడి మనసు తెలుసుకోవాలని చెప్పారు. కానీ నేటి రాజకీయాలు పూర్తీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఒక చదరంగంలా మారిపోయాయన్నారు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు. విశ్వసనీయత, నిజాయితీ ఒక వైపున ఉన్నాయని, కుళ్లు,కుతంత్రాలు మరో వైపున ఉన్నాయని అన్నారు.