తెలుగుజాతి పౌరుషం కోసం ఓటెయ్యండి
కనిగిరి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ కోసం ఓటెయ్యమని అడుగుతున్నారని, తాను మాత్రం తెలుగుజాతి పౌరుషం కోసం ఓటెయ్యమని అడుగుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తుంటే ఈ చంద్రబాబు,ఈ మోడీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్‌ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు.
బీజేపీ, టీడీపీ నేతలు తెలంగాణాలో ఒకతీరుగా, సీమాంధ్రలో మరో తీరుగా రాష్ట్ర విభజపై మాట్లాడుతున్నారని చెప్పారు. అక్కడ తెలంగాణకు అనుకూలంగా తాము ఓటేశామని చెప్పారు. ఇక్కడ రాష్ట్రం విడిపోవడానికి తాను కారణం అని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ విషయంలో పెద్దమ్మని ఒక్కదాన్నే కాకుండా చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోవాలన్న బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్న మాటలను గుర్తు చేశారు.
రాజకీయం అనేది ఓ చదరంగంలా మార్చారని బాధపడ్డారు. ఓట్లు, సీట్లకోసం ఓ వ్యక్తిని జైలుకు పంపేందుకు వెనకాడడంలేదని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాధ్యంకాని హామీలిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్‌కు మించిన హామీలిస్తూ పట్టపగలే మోసం చేస్తున్నారని చెప్పారు.
మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలున్నాయని, మనం వేసే ఓటుతో మన తలరాతలు మార్చుకుందాం అన్నారు. ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యండని విజ్ఞప్తి చేశారు. ఏ నాయకుడైతే ప్రజల మనసు తెలుసుకుంటాడో ఆ వ్యక్తినే మీ నాయకునిగా ఎన్నుకోండని సలహా ఇచ్చారు. ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా? ఢిల్లీకి సాగిలపడే చంద్రబాబు కావాలా? అని ఆయన అడిగారు. ప్రజా సేవ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించమని జగన్ కోరారు.