కొవ్వూరు :గోదావరి పుష్కరాల మహాపర్వం సమీపిస్తోంది. గోదావరిపై శిథిలావస్థకు చేరిన రోడ్ కం రైలు వంతెనకు మరమ్మతులు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ పనులు మొదలు పెట్టాలంటే కొవ్వూరు-దివాన్‌చెరువు మధ్య నిర్మాణంలో ఉన్న రెండో వం తెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అయితే, ఆ పనులు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోవటం లేదు. పుష్కరాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి జిల్లాలకు తరలి వస్తా రు. ఈ నేపథ్యంలో రోడ్ కం రైలు బ్రిడ్జి మరమ్మతులతోపాటు రెండో వారధి నిర్మాణం పూర్తికాకపోతే అటు రాజ మండ్రి, ఇటు కొవ్వూరులో ట్రాఫిక్ చిక్కులు తప్పవు.
శిథిలావస్థకు చేరిన రోడ్ కం రైలు వంతెనకు మరమ్మతులు చేపట్టాలంటే దాని మీదుగా వాహనాల రాకపోకలను కనీసం నెల రోజుల పాటు నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ట్రాఫిక్‌ను కొత్తగా నిర్మిస్తున్న కొవ్వూరు-దివాన్‌చెరువు వారధి మీదుగా మళ్లించాలి. ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రయాణించే వాహనాలకు రెండో వారధి ప్రత్యామ్నాయంగా కానుంది. ఇదిలావుండగా, రోడ్ కం రైలు వంతెన తాత్కాలిక మరమ్మతులకు ఈనెల 12న టెండర్లు ఖరారైనప్పటికీ వాహనాల ప్రయాణానికి ప్రత్యామ్నాయం ఉండదన్న ఉద్దేశంతో పనులను వాయిదా వేశారు. ఇటువంటి కీలక తరుణంలో రెండో వారధి నిర్మా ణం ఆలస్యమైతే ఆ ప్రభావం రోడ్ కం రైలు వంతెన మరమ్మతులపై పడుతుంది. రెండో వంతెన నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పుష్కరాల సాధికారత కమిటీ ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని చూస్తే మరో రెండు నెలలకు గాని ఈ వంతెన పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
కొనసాగుతున్న రెయిలింగ్ పనులు
రెండో వంతెన ఎడమ వైపు రెండు వరుసల రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. వంతెనపై తారు రోడ్డు వేయాల్సి, 58వ పిల్లర్ సమీపంలో జాయింట్ వేయాల్సి ఉంది. ఆ పనుల ను అసంపూర్తిగా విడిచిపెట్టారు. కుడివైపు రెండు వరుసల వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ రెయిలింగ్ పనులు పూర్తి కాలేదు. 48వ కుడి పిల్లర్ నుంచి 55వ పిల్లర్ వరకు మాత్రమే రెయిలింగ్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ పనులు పూర్తయితే తప్ప వంతెనపై తారు రోడ్డు వేసే పరిస్థితి లేదు.
పూర్తి కాని అప్రోచ్ రోడ్ల నిర్మాణం
వంతెనకు రెండువైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అన్నిరకాల అడ్డంకులు తొలగి రెండేళ్లు కావస్తున్నా పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కొవ్వూరు వైపు 1.98 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. కేవలం సీఆర్‌బీ రోడ్డు వేశారు. ప్రస్తుతం కొవ్వూరు వాటర్‌వర్క్స్ సమీపంలో నిర్మించిన అండర్ పాసేజ్ వద్ద కాంక్రీట్ పనులు అసంపూర్తిగా జరిగాయి. ఆర్టీసీ కాలనీ సమీపంలో ఇటీవలే రివిట్‌మెంట్ పనులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుంచి దివాన్‌చెరువు మీదుగా జాతీయ రహదారిని కలుపుతూ 9 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మిస్తున్నారు. కాతేరు సమీపంలో అండర్ పాసేజ్ నిర్మాణంలో ఉంది. రాజ మండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారిలో నిర్మించే అండర్ పాసేజ్ మార్గం వద్ద పనులు పూర్తికాలేదు. తోట వెంకటాచలం ఎత్తిపోతల పథకం కాలువపై అండర్ టన్నెల్ నిర్మాణంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా వైపు వంతెన నుంచి అప్రోచ్ రోడ్డుకు సుమారు కిలోమీటరు మేర ఇరువైపులా గోడ నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. కాతేరుకు అర కిలోమీటరు దూరం నుంచి దివాన్‌చెరువుకు అరకిలో మీట రు దూరం వరకు తారు రోడ్డు వేశారు. జాతీయ రహదారిని కలిపే ప్రదేశంలో సుమారు అర కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
ఆది నుంచీ ఆలస్యమే
ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ అఖండ గోదావరిపై ఆరేళ్ల క్రితం ప్రారంభించిన రెండో వారధి నిర్మాణం పనులు తొలినుంచీ నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచినప్పటికీ నిర్మాణం పూర్తి కావడం లేదు. రూ.808 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను గామన్ ఇండియా సంస్థ బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిపై నాలుగు వరుసల రోడ్డు వంతెత రూపంలో నిర్మిస్తోంది. 4.10 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన పనులను 2009 మే నెలలోప్రారంభించారు. 2012 మే నాటికి మొత్తం పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. వివిధ కారణాలతో గడువు పొడిగించుకుంటూ వచ్చారు. మార్చి నెలాఖరు నాటికి చివరి గడువు పూర్తికానుంది.
వారధి.. వెళ్లే దారేది
Published Fri, Feb 20 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement