సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది చంద్రబాబేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు, సుజనా చౌదరి స్వాగతించారని, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులతో సమానంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తున్నామని, దీనికి ముఖ్యమంత్రి కూడా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు.
ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు హోంమంత్రి బదులిచ్చారు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. బిల్లులో పేర్కొన్న హామీల్లో 90 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామన్నారు. రైల్వే జోన్‌పై ప్రతికూలంగా నివేదిక వచ్చినా జోన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును తామే కడతామని ఏపీ సర్కార్ కోరితే అంగీకరించామని, పోలవరానికి ఇప్పటివరకూ రూ 6754 కోట్లు మంజూరు చేశామన్నారు.
రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. తొలి కేబినెట్ భేటీలోనే 7 ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి హోదా ఇస్తారా లేదా స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో హోదా నిరాకరించడం సరైందికాదని విమర్శించారు.మరోవైపు టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై రాజ్‌నాథ్ సెటైర్లు వేశారు. చర్చలో తాము చెబుతున్న అంశాలపై సుజనా చౌదరి మారుమాట్లాడలేక తలదించుకున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment