పోలవరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ సవరణ బిల్లు(పోలవరం ప్రాజెక్టు బిల్లు)ను రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో పోలవరం ప్రజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ బిల్లు ప్రకారం ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలు ఏపిలో కలసిపోతాయి. ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తరువాత సభ ఆమోదించింది. అంతకు ముందు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలు పరిశీలించిన తరువాతే ఆమోదించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు సమకూరుస్తుందని చెప్పారు.
భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని, ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటామని చెప్పారు. ఆదివాసీలకు ఎటువంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే బిల్లును తీసుకువచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన ఏమీ లేదన్నారు. పోలవరంపై ఎటువంటి ఆందోళనలు వద్దని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ ప్రసంగానికి అభినందనలు తెలిపారు. చర్చలో భాగంగా ఆయన మంచి సూచనలు చేశారన్నారు.