సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే కనిపించడం లేదు. పోలీసులు వెతుకుతున్నా అతని ఆచూకీ లభించడం లేదట. ఆయన కోసం ఇంటికి వెళ్లినా కనిపించడం లేదు. ఆయన్ను పట్టుకోవడం కోసం జిల్లా పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. నెల్లూరులో లేకపోతే, హైదరాబాద్‌కు పోయింటారనే ఉద్దేశంతో అక్కడకు వెళ్లినా పోలీసులకు ఆచూకీ లభించడం లేదు. మూడు పోలీసు బృందాల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయనే వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఆయన కోసం పోలీసులు నాలుగు రోజులుగా గాలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆయన తప్పించుకుని వెళ్లేందుకు వీలు కల్పించిన పోలీసులు, పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుందన్న చందాన, ఆయన కోసం వెతుకుతున్నట్లు హైడ్రామాలు ఆడుతున్నారు. నెల్లూరులో విడిచిపెట్టి, హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత, తీరిగ్గా మూడు బృందాలను ఏర్పాటు చేయడమేమిటని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఆయన ఎక్కడున్నదీ తెలియడం లేదని, గాలిస్తున్నామని పోలీసులు చెప్పుకుంటున్నారు. అయితే కురుగొండ్ల ఎక్కడ ఉన్నాడనే విషయం ఆపార్టీ నాయకులందరికీ తెలుసంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రక్షణలోనే ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రికి చెందిన ఒక అతిథి గృహంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రామకృష్ణ తలదాచుకున్నారని సమాచారం. నెల్లూరులో ఆయన అనుచరులు బెయిలు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయనకు బెయిలు వస్తుందని ఆశిస్తున్నారు. బెయిలు వచ్చిన తరువాత కురుగొండ్ల మళ్లీ నెల్లూరులో అడుగు పెడతారని అనుచరులు అంటున్నారు. ఈనెల 13వ తేదీన జరిగే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లోపు బెయిలుతో నెల్లూరులో అడుగు పెడతారని, మళ్లీ ఎన్నికలను అడ్డుకుంటారని ఘంటా పథంగా చెబుతున్నారు. సాక్షాత్తు కలెక్టర్‌పై జెడ్పీటీసీలు, పోలీసులు, పత్రికా విలేకరులు ఉన్న హాలులో దాడికి దిగిన ఎమ్మెల్యేను వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్‌పైనే ప్రజాప్రతినిధి దాడి చేస్తే సాధారణ ప్రజల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు ఎమ్మెల్యే తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యేను రక్షించుకునేందుకు టీడీపీ నాయకులు మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కురుగొండ్ల తప్పేమీ లేదని సమావేశాలు పెట్టి మరీ చెబుతున్నారు.
రామరామ.. కృష్ణకృష్ణ
Published Thu, Jul 10 2014 2:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement